బార్ కౌన్సిల్ పదవులకు కాల పరిమితి విధించండి!
ABN , Publish Date - Aug 17 , 2026 | 06:39 AM
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) చైర్మన్ సహా ఇతర పదవులకు కాల పరిమితి విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అలాగే రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు కూడా...
సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
న్యూఢిల్లీ, బెంగళూరు, ఆగస్టు 16: బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) చైర్మన్ సహా ఇతర పదవులకు కాల పరిమితి విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అలాగే రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు కూడా కాల పరిమితి విధించాలని పిటిషనర్ అభ్యర్థించారు. బార్ కౌన్సిళ్లకు ఎన్నికలు నిర్వహించకుండా, ఆయా పదవుల్లోని వారు సుదీర్ఘకాలంగా కొనసాగడంపై పిటిషనర్, అడ్వొకేట్ ఎం.వర్ధన్ ఆందోళన వ్యక్తం చేశారు. బీసీఐలోని సభ్యులు తదుపరి ఎన్నికలు జరిగి, కొత్త సభ్యులు వచ్చేవరకు కొనసాగవచ్చని పేర్కొంటున్న అడ్వొకేట్స్ చట్టం-1961లోని సెక్షన్ 4(3)ను ఆయన ప్రశ్నించారు. చట్టబద్ధ సంస్థల్లో ఖాళీలు ఏర్పడకుండా ఉండేందుకు, తదుపరి సభ్యులు వచ్చే వరకు మాత్రమే కొనసాగాలన్నది దీని ఉద్దేశమని, కానీ, పాత సభ్యులు నిరంతరాయంగా కొనసాగేలా ఈ సెక్షన్‌ను దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు.
నల్సార్ బాటలో మరో లా వర్సిటీ: నల్సార్ యూనివర్సిటీ బాటలోనే.. బెంగళూరుకు చెందిన ఎన్‌ఎల్‌ఎ్‌సఐయూ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు వర్సిటీ స్నాతకోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, బీసీఐ చైర్మన్ మనన్‌కుమార్ మిశ్రాలను ఆహ్వానించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు శనివారం ఒక లేఖను విడుదల చేశారు. నల్సార్ విద్యార్థులకు తాము బేషరతుగా సంఘీభావం తెలుపుతున్నట్టు లేఖలో పేర్కొన్నారు.
వార్తలు కూడా చదవండి...
జీఆర్ఎంబీ అజెండా నుంచి తెలంగాణ వ్యతిరేక అంశాలు తొలగించాలి: హరీశ్‌రావు
నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోంది: డీజీపీ ఆనంద్
నకిలీ ట్రేడింగ్ యాప్‌తో బురిడీ.. సీఏను మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు