జడ్జిల వ్యాఖ్యలతో వ్యాపారం చేస్తున్నారు!
ABN , Publish Date - Aug 12 , 2026 | 07:40 AM
నకిలీ న్యాయవాదులు, నకిలీ న్యాయవిద్య పట్టాల వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
అలాంటి వారిపై చర్యలు తీసుకోండి.. సుప్రీంకోర్టులో పిటిషన్
న్యూఢిల్లీ, (ఆంధ్రజ్యోతి) : నకిలీ న్యాయవాదులు, నకిలీ న్యాయవిద్య పట్టాల వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అలాగే కోర్టుల్లో న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలను అసందర్భంగా కట్ చేసి, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడంతో పాటు వాటిని వ్యాపార ప్రయోజనాలకు వాడుకునే వారిపైనా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. న్యాయవాది రాజా చౌధరి దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్ వి.మోహనల ధర్మాసనం మంగళవారం విచారణకు స్వీకరించింది.
కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది. నకిలీ న్యాయవాదులు, నకిలీ ఎల్‌ఎల్‌బీ పట్టాలు, ఇతరుల పేరుతో న్యాయవాద వృత్తిలో కొనసాగడం వంటి అంశాలపై స్వతంత్ర సంస్థతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని పిటిషనర్ కోరారు. ఇందుకు సీబీఐ లేదా మరో స్వతంత్ర దర్యాప్తు సంస్థను నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ కార్యకలాపాలనూ పరిశీలించాలని కోరారు.
కోర్టులో జరిగిన సంభాషణలను కొందరు వ్యక్తులు వక్రీకరించి, జడ్జిల వ్యాఖ్యలను కట్‌చేసి వీడియో క్లిప్పులు, మీమ్స్, ఇతర కంటెంట్‌గా సోషల్ మీడియాలో వైరల్ చేయడంతోపాటు వాటి ద్వారా వాణిజ్య ప్రయోజనాలు పొందుతున్నారని పిటిషనర్ ఆరోపించారు. న్యాయమూర్తుల మౌఖిక వ్యాఖ్యలు తుది తీర్పులు కావని.. వాటిని వాణిజ్యపరంగా వినియోగించడం, ట్రేడ్‌మార్క్‌లుగా మార్చడం, మీమ్ వ్యాపారం చేయడం, రాజకీయ బ్రాండింగ్‌కు ఉపయోగించడం లేదా డిజిటల్ మాధ్యమాల్లో డబ్బు ఆర్జించే సాధనంగా మార్చడం సరికాదని పిటిషనర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
కీలక బిల్లులు లేకుండానే పార్లమెంటు వాయిదా!