Share News

లాఠీచార్జిని సమర్థించలేం

ABN , Publish Date - Jul 28 , 2026 | 05:58 AM

శాంతియుతంగా నిరసన తెలపడం అనేది రాజ్యాంగ కల్పించిన హక్కు అని, దాన్ని నిరాకరించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆందోళన చేసినంత మాత్రాన పోలీసులు నిరసనకారులపై..

లాఠీచార్జిని సమర్థించలేం

  • సీజేఐ సూర్యకాంత్‌ ధర్మాసనం వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, జూలై 27: శాంతియుతంగా నిరసన తెలపడం అనేది రాజ్యాంగ కల్పించిన హక్కు అని, దాన్ని నిరాకరించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆందోళన చేసినంత మాత్రాన పోలీసులు నిరసనకారులపై లాఠీచార్జి చేయడం లేదా బలప్రయోగం చేయడం వంటి చర్యలను సమర్థించలేమని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ సోమవారం స్పష్టం చేశారు. కేవలం ఢిల్లీ ఘటనే కాదు.. మరే ఇతర సందర్భంలోనైనా పోలీసులు మితిమీరిన చర్యలకు పాల్పడితే, దాన్ని స్వతంత్రంగా పరిశీలించాలని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిరసనల సందర్భంగా పోలీసులు అనుసరించాల్సిన విధివిధానాలపై దేశవ్యాప్తంగా ఒకేవిధమైన మార్గదర్శకాలు ఉండాల్సిన అవసరం ఉందని, ప్రజాస్వామ్య ప్రక్రియకు స్వీయ క్రమశిక్షణ అవసరమని అభిప్రాయపడింది. జంతర్‌మంతర్‌లో పోలీసులు ఆందోళనకారుల పట్ల వ్యవహరించిన తీరుపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ బాగ్చి, జస్టిస్‌ మోహనలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఢిల్లీ నిరసనల్లో దాడికి గురైన పోలీసు సిబ్బంది కుటుంబసభ్యుల్లో కొందరు వేరుగా దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.ప్రతి ఒక్కరి ప్రాణం ముఖ్యమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు పోలీసులకు తగిన భద్రతా పరికరాలు ఎందుకు ఇవ్వడం లేదో పరిశీలించాలని మేం రాష్ట్ర ప్రభుత్వాలను కోరే అంశాన్ని పరిశీలిస్తాం’ అని జస్టిస్‌ బాగ్చి అన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

హైడ్రా చీఫ్‌ రంగనాథ్‌కు మద్దతుగా రేవంత్‌ సర్కార్‌..!

బడా బాబుల జోలికి వెళ్లని హైడ్రా: టీబీజేపీ చీఫ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 28 , 2026 | 05:58 AM