Share News

వాహన బీమా లేకుంటే బంక్‌లో పెట్రోల్‌ కొట్టొద్దు!

ABN , Publish Date - Aug 05 , 2026 | 06:20 AM

దేశంలో ఏటా లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ వాహనాలకు బీమా చేయించడంలో ప్రజల నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో...

వాహన బీమా లేకుంటే బంక్‌లో పెట్రోల్‌ కొట్టొద్దు!

  • కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదనలు

న్యూఢిల్లీ, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఏటా లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ వాహనాలకు బీమా చేయించడంలో ప్రజల నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో ఇంధనం నింపకుండా నిషేధం విధించే విధానాన్ని ప్రయోగాత్మకంగా(పైలట్‌ ప్రాజెక్ట్‌) అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. తెలంగాణలో 1996లో జరిగిన ఓ రోడ్డు ప్రమాద కేసుకు సంబంధించిన పరిహారంపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. రోడ్లపై తిరుగుతున్న వాహనాల్లో 56ు వాటికి బీమా లేకపోవడం దిగ్ర్భాంతికరమని వ్యాఖ్యానించింది. దేశంలోని 30.48 కోట్ల రిజిస్టర్డ్‌ వాహనాలు ఉంటే 16.54 కోట్ల వాహనాలకు ఎలాంటి బీమా లేదని గుర్తు చేసింది. దేశవ్యాప్తంగా ఏటా 4.8 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రస్తావించింది. కనీస బీమా లేకపోవడం వల్ల ప్రమాద బాధితులకు, వారి కుటుంబాలకు నష్టపరిహారం అందడంలో దశాబ్దాల తరబడి జాప్యం జరుగుతోందని కోర్టు గుర్తు చేసింది. బీమా లేకుండా వాహనం నడుపుతూ తొలిసారి దొరికితే.. వార్షిక బీమా ప్రీమియంకు మూడు రెట్లు లేదా రూ.5,000(రెండింటిలో ఏది ఎక్కువైతే అది) జరిమానాగా వసూలు చేయాలి. రెండోసారి పట్టుబడితే ప్రీమియంకు ఐదు రెట్లు లేదా రూ.10,000 ఫైన్‌ వేయాలని ప్రతిపాదించింది. ఈ కేసులో మృతుడి కుటుంబానికి 7.5ు వడ్డీతో సహా రూ.10,00,500 పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు చేసిన సూచనలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటే మోటారు వాహన రంగంలో భారీ మార్పులు రానున్నాయి. కొత్త కార్లకు తప్పనిసరిగా ఉండే థర్డ్‌ పార్టీ బీమా వ్యవధిని ప్రస్తుతమున్న 3 ఏళ్ల నుంచి 4 ఏళ్లకు పెంచాలని ఐఆర్‌డీఏఐని కోర్టు ఆదేశించింది. కొత్త ద్విచక్ర వాహనాలకు ఈ గడువును 5 ఏళ్ల నుంచి 6 ఏళ్లకు పొడిగించాల్సి ఉంటుంది. జాతీయ రహదారులు, నగరాల్లోని ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నిషన్‌(ఏఎన్‌పీఆర్‌) కెమెరాలను కేంద్ర ప్రభుత్వ ‘వాహన్‌’ డేటాబేస్‌, ఇన్సూరెన్స్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరోలతో అనుసంధానించాలని కోర్టు ఆదేశించింది. టోల్‌ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించేందుకు ఏఎన్‌పీఆర్‌ టెక్నాలజీతో కూడిన టోలింగ్‌ విధానాలను మరింత విస్తరించాలని సూచించింది.

ఇవి కూడా చదవండి..

ఇజ్రాయెల్‌కున్న గొప్ప స్నేహితుల్లో మోదీ ఒకరు: బెంజమిన్ నెతన్యాహు

ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట.. విచారణ అనంతరం విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశం..

Updated Date - Aug 05 , 2026 | 06:28 AM