పెళ్లైన కుమార్తెలూ కారుణ్య నియామకానికి అర్హులే!
ABN , Publish Date - Jun 03 , 2026 | 06:34 AM
పెళ్లయినంత మాత్రాన కుమార్తె పరాయి మనిషి కాబోదని, కారుణ్య నియామకానికి ఆమెకు కూడా అర్హత ఉంటుందని.. అర్హత లేదని అంటే అది రాజ్యాంగ విరుద్ధమవుతుందని సుప్రీంకోర్టు...
న్యూఢిల్లీ, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): పెళ్లయినంత మాత్రాన కుమార్తె పరాయి మనిషి కాబోదని, కారుణ్య నియామకానికి ఆమెకు కూడా అర్హత ఉంటుందని.. అర్హత లేదని అంటే అది రాజ్యాంగ విరుద్ధమవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కుల్సుమ్ నిషా అనే మహిళ వివాహం అయినప్పటికీ తన పుట్టింటిలో ఉంటూ తల్లితో కలిసి రేషన్‌షాపును నిర్వహించేవారు. శారీరక వికలాంగురాలైన తన సోదరి బాధ్యతలను సైతం చూసుకునేవారు. కొంతకాలానికి ఆమె తల్లి మరణించారు. తల్లి పేరిట ఉన్న రేషన్ షాప్ లైసెన్స్‌ను కారుణ్య ప్రాతిపదికన తనకు కేటాయించాలని కుల్సుమ్ ప్రభుత్వానికి అప్లై చేసుకున్నారు. కానీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2019లో తెచ్చిన జీవో ప్రకారం ‘కుటుంబం’ అనే నిర్వచనంలో వివాహమైన కుమార్తెలకు చోటు లేదంటూ అధికారులు ఆమె దరఖాస్తును తిరస్కరించారు. దీనిపై ఆమె న్యాయపోరాటం ప్రారంభించారు. అలహాబాద్ హైకోర్టు ఈ అంశాన్ని సుప్రీంకోర్టుకు రిఫర్ చేసింది. దీనిపై మంగళవారం విచారణ జరిగింది. వివాహం చేసుకున్న కుమారులకు లేని నిబంధనలు, కుమార్తెలకు ఎలా వర్తింపజేస్తారని విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. ‘కుమార్తెకు కారుణ్య నియామకాన్ని నిరాకరించడానికి వివాహం అనేది కారణం కాబోదు’ అని స్పష్టం చేసింది. నిషా పెళ్లయినప్పటికీ తల్లితోనే ఉంటూ, దివ్యాంగురాలైన సోదరి బాధ్యతలు చూసుకుంటున్న విషయాన్ని కోర్టు గుర్తు చేసింది.
Also Read:
ఖర్జూరాలు.. కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయా?
చిన్న పిల్లాడిలా మారి.. డ్యాన్స్ చేసిన విరాట్! వీడియో వైరల్...
For More Latest News