నిరసనలో హింసపై విచారణకు.. ఉన్నతస్థాయి కమిటీ
ABN , Publish Date - Aug 19 , 2026 | 06:09 AM
నీట్ పరీక్ష పేపర్ లీకేజీని నిరసిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) గత నెల 20న ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమం సందర్భంగా చోటుచేసుకున్న హింసపై విచారణ..
సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి, హైకోర్టు రిటైర్డ్
సీజే, రిటైర్డ్ పోలీస్ అధికారులతో ఏర్పాటు
గత నెల 20న ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో జరిగిన
హింసాత్మక ఘటనలపై విచారణ: సుప్రీంకోర్టు
కమిటీ సిఫారసుల ఆధారంగా మార్గదర్శకాలు
ఇస్తామని అత్యున్నత న్యాయస్థానం వెల్లడి
న్యూఢిల్లీ, ఆగస్టు 18: నీట్ పరీక్ష పేపర్ లీకేజీని నిరసిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) గత నెల 20న ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమం సందర్భంగా చోటుచేసుకున్న హింసపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. నాడు విద్యార్థులపై పోలీసులు తీవ్రంగా దాడులు చేశారని, పోలీసులపై కూడా కొందరు నేరస్తులు విద్యార్థుల ముసుగులో దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల బలప్రయోగాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వీ మోహనతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా నాటి హింసపై సమగ్ర విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, హైకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తితోపాటు ఒక సీనియర్ రిటైర్డ్ పోలీస్ అధికారి సభ్యులుగా ఉంటారని సీజేఐ తెలిపారు. అన్ని పక్షాల వాదనలను నమోదుచేసి ఈ కమిటీ వరుసగా ఇచ్చే నివేదికల ఆధారంగా భవిష్యత్తులో ఇలాంటి ప్రజాందోళనల సమయంలో పాటించాల్సిన నిబంధనలపై మార్గదర్శకాలు జారీచేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఇది విద్యార్థుల జీవితం, భవిష్యత్తుకు సంబంధించిన అంశం. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు శాంతియుత మార్గంలో నిరసన తెలిపే హక్కు విద్యార్థులకు ఉంది. అయితే, ఇలాంటి నిరసనల్లో నేరస్తులు చొరబడి హింసకు పాల్పడితే మాత్రం ఆ నేరస్తులను శిక్షించాల్సిందే. మేము ఏర్పాటు చేసే కమిటీ జూలై 20న విద్యార్థులపై పోలీసులు తీవ్రమైన బలప్రయోగం చేశారా లేదా? అన్నిదానిపై విచారణ జరుపుతుంది. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థినులపై లైంగిక వేధింపులు, సోషల్‌మీడియా వేదికగా బెదిరింపులు వస్తున్న విషయాన్ని కూడా ఈ కమిటీ విచారిస్తుంది’ అని తెలిపారు. బాధితులు ఈ కమిటీకి స్వయంగా తమ వాదన వినిపించవచ్చని ధర్మాసనం సూచించింది. ఇదిలా ఉండగా, అమాయక విద్యార్థులపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను రద్దుచేయాలని సుప్రీంకోర్టు సూచించినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని సీజేపీ ఆరోపించింది. ఎఫ్‌ఐఆర్‌లను రద్దుచేస్తామని జూలై 25న ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి సౌరవ్‌దాస్ మంగళవారం డిమాండ్ చేశారు. ఎఫ్‌ఐఆర్‌లను ప్రభుత్వం వెంటనే రద్దుచేయకుంటే 2రోజుల్లో తమ పార్టీ నేషనల్ వర్కింగ్ కమిటీ సమావేశమై మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతుందన్నారు.
దీప్కే ఆప్ కార్యకర్త: రిజిజు
సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘దీప్కే ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కార్యకర్త. ఆయన విద్యార్థి ఎలా అవుతాడు?.’’ అని ప్రశ్నించారు. ఆప్ కార్యకర్త అయి ఉండి విద్యార్థి నాయకుడిగా చలామణి అవడమేంటని నిలదీశారు. ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిజిజు స్పందిస్తూ.. విద్యార్థులు లేవనెత్తిన అంశాలు, చేపట్టిన నిరసన నిజమైనవే అయినప్పటికీ.. ఆప్ తన ఉనికిని కాపాడుకునేందుకు ఈ నిరసనలను హైజాక్ చేసేందుకు ప్రయత్నించిందని దుయ్యబట్టారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లపై వారితో నేరుగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందన్నారు. జెన్-జీతో బీజేపీ పెద్దగా సాన్నిహిత్యం పెంచుకోవడం లేదన్న వాదనను కేంద్ర మంత్రి తోసిపుచ్చారు. తమ పార్టీ యువతను కలుసుకుంటోందని, వారి అభిప్రాయాలు తెలుసుకుంటోందని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇమ్రాన్ ఖాన్‌ను ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందించాలి.. సుప్రీం కీలక ఆదేశాలు
మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్‌లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం