Share News

దివ్యాంగులను కించపరిచినందుకు యూట్యూబర్లకు 3 లక్షల చొప్పున ఫైన్‌

ABN , Publish Date - Jul 15 , 2026 | 06:01 AM

దివ్యాంగులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయటమేగాక, తమ ఆదేశాలను పాటించనందుకు కమెడియన్‌ సమయ్‌ రైనా, యూట్యూబర్లు రణ్‌వీర్‌ అలహాబాదియా, ఆశిష్‌ చంచలానిలపై..

దివ్యాంగులను కించపరిచినందుకు యూట్యూబర్లకు 3 లక్షల చొప్పున ఫైన్‌

  • దివ్యాంగుల కోసం ఎస్సీ ఎస్టీ తరహాలో కఠినమైన

చట్టం తేవాలని కేంద్రప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచన

న్యూఢిల్లీ, జూలై 14: దివ్యాంగులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయటమేగాక, తమ ఆదేశాలను పాటించనందుకు కమెడియన్‌ సమయ్‌ రైనా, యూట్యూబర్లు రణ్‌వీర్‌ అలహాబాదియా, ఆశిష్‌ చంచలానిలపై సుప్రీంకోర్టు రూ.3 లక్షల చొప్పున జరిమానా విధించింది. ‘ఇండియా గాట్‌ టాలెంట్‌’ పేరుతో నిర్వహించే ఓ షోలో సమయ్‌రైనా.. ‘స్పైనల్‌ మస్క్యులర్‌ అట్రోఫీ’ (ఎస్‌ఎంఏ) అనే వ్యాధి చికిత్సకు అయ్యే భారీ వ్యయంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఎస్‌ఎంఏతో బాధపడే ఓ వ్యక్తిని అపహాస్యం చేశారని సుప్రీంకోర్టులో గతంలో ఓ వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఇకపై ప్రతీ నెలలో రెండుసార్లయినా తమ షోలలో దివ్యాంగులు ముఖ్యంగా ఎస్‌ఎంఏ బాధితుల విజయగాథలను పరిచయం చేయాలని, ఆ షోల ద్వారా వచ్చే డబ్బును ఎస్‌ఎంఏ బాధితల చికిత్సకు అందించాలని ఆదేశించింది. దివ్యాంగులను కించపరిచినందుకు బేషరతు క్షమాపణ చెబుతున్నట్లుగా షోలలో ప్రకటించాలని పేర్కొంది. ఈ ఆదేశాలను సమయ్‌ రైనాతోపాటు ఇతర యూట్యూబర్లు పాటించలేదని పిటిషనర్‌ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురాగా.. దీనిపై సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఆదేశాలు పాటిస్తామంటూ తమకు ఇచ్చిన హామీని ఉల్లంఘించారని, ఇది అహంకారం తప్ప మరొకటి కాదని సీజేఐ పేర్కొన్నారు. కాగా, దివ్యాంగుల గౌరవాన్ని పరిరక్షించటం కోసం ఎస్సీ, ఎస్టీ చట్టం తరహాలో కఠినమైన చట్టం తీసుకొచ్చే అంశంపై యోచించాలని ధర్మాసనం కేంద్రప్రభుత్వానికి సూచించింది.

ఈ వార్తలనూ చదవండి:

పునరాగమనాన్ని ఘనంగా చాటిన బుమ్రా.. జడేజాను అధిగమించి..

జపాన్ ఓపెన్ టోర్నీ: పీవీ సింధు శుభారంభం

Updated Date - Jul 15 , 2026 | 06:01 AM