ప్రతి మతాచారాన్ని కోర్టులో సవాల్ చేయలేరు..
ABN , Publish Date - May 08 , 2026 | 04:41 AM
దేశంలోని మతాల్లో ఉన్న ప్రతి ఆచారాన్ని కోర్టుల్లో సవాలు చేస్తూ పోతే చివరకు మతాలు, భారత నాగరికత కూడా మిగలదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మతాల్లో ఉండే...
శబరిమల కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం
న్యూఢిల్లీ, మే 7: దేశంలోని మతాల్లో ఉన్న ప్రతి ఆచారాన్ని కోర్టుల్లో సవాలు చేస్తూ పోతే చివరకు మతాలు, భారత నాగరికత కూడా మిగలదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మతాల్లో ఉండే ప్రతి ఆచారం, ప్రతి నియమంపై కోర్టులు జోక్యం చేసుకోవటం మంచిది కాదని పేర్కొంది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ 2018లో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కోర్టు విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశంలో మత స్వేచ్ఛపై విచారణ జరిపేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌నేతృత్వంలో 8 మంది న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. మతాల్లోని ‘బహిష్కరణ’ ఆచారం చట్టవిరుద్ధమంటూ 1949లో తీసుకొచ్చిన బాంబే ప్రివెన్షన్ ఆఫ్ ఎక్స్‌కమ్యూనికేషన్ యాక్ట్-1947ని రద్దుచేస్తూ 1962లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్‌చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ దావూదీ బోహ్ర కమ్యూనిటీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ ధర్మాసనం గురువారం విచారించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘బహిష్కరణ నిరోధక చట్టాన్ని’ కోర్టు కొట్టివేయటం వల్ల బోహ్రా వర్గంలోని లౌకిక ఆలోచనలున్న వ్యక్తులు తీవ్ర శిక్షలకు గురవుతున్నారని తెలిపారు. ఇలాంటి ఆచారాలు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కూడా ఉల్లంఘిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సమయంలో పలువురు న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మతాల్లోని ప్రతి ఆచారాన్ని, ప్రతి నియమాన్ని ప్రశ్నిస్తూ రాజ్యాంగ ధర్మాసనాల ముందుకు వస్తే.. మతాలతో పెనవేసుకుపోయిన మన నాగరికత మనుగడ ఏమవుతుంది? మతానికి సంబంధించిన ప్రతి విషయంలో కోర్టులు జోక్యం చేసుకుంటే ఈ ఆలయంలో ఇది తప్పు, ఆ ఆలయంలో అది తప్పు అని వందల పిటిషన్లు వచ్చిపడతాయి. ఈ విషయంలో మాకు పూర్తి స్పష్టత ఉంది. దేశం ఆర్థికంగా, అన్నిరకాలుగా ప్రగతి సాధించాలి. అందుకు మా 9 మంది న్యాయమూర్తులు ఇచ్చే తీర్పు ప్రతిబంధకం కాకూడదు. అదే మా ఆలోచన’ అని జస్టిస్ నాగరత్న అన్నారు. ‘ప్రతి పిటిషన్‌ను అనుమతిస్తూ పోతే ప్రతి ఒక్కరూ, మతాల్లోని ప్రతి అంశాన్ని ప్రశ్నిస్తారు. అప్పుడు మతాలు, నాగరికత కూడా ముక్కలవుతాయి. రాజ్యాంగ ధర్మాసనాలనే మూసేయాల్సి వస్తుంది’ అని జస్టిస్ సుందరేశ్ వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వివాహ వేడుకలో ఫుడ్ పాయిజన్.. 44 మందికి తీవ్ర అస్వస్థత
డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
Read Latest National News And Telugu News