అది రాజకీయ ప్రక్రియలో భాగమే!
ABN , Publish Date - Oct 27 , 2026 | 04:23 AM
ఒక ఎమ్మెల్యే రాజీనామా చేసి మరో పార్టీలో చేరడం, మంత్రి పదవి చేపట్టడం సాధారణ రాజకీయ ప్రక్రియలో భాగమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది
ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి మరోపార్టీలో చేరడంపై సుప్రీం కోర్టు స్పష్టీకరణ
అన్నాడీఎంకే ఎమ్మెల్యేల రాజీనామాపై పిటిషన్ కొట్టివేత
చెన్నై, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): ఒక ఎమ్మెల్యే రాజీనామా చేసి మరో పార్టీలో చేరడం, మంత్రి పదవి చేపట్టడం సాధారణ రాజకీయ ప్రక్రియలో భాగమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అందులో నేరపూరితమైనదేమీ లేదని తేల్చిచెప్పింది. అన్నాడీఎంకే పార్టీ జారీ చేసిన విప్‌నకు వ్యతిరేకంగా ఓటు వేసిన అనంతరం స్వచ్ఛందంగా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి అధికార టీవీకే పార్టీలో చేరిన ఆరుగురిపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బాగ్చీ, జస్టిస్ మోహనల ధర్మాసనం సోమవారం ఈ తీర్పు ఇచ్చింది. ‘ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారంటూ ఇప్పటికే ఒక ఎఫ్‌ఐఆర్ నమోదైందని పిటిషనర్ చెబుతున్నందున.. దానిపై విచారణ జరగనివ్వండి. చట్టం తన పని తాను చేసుకుంటుంది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాల్లో భాగంగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఎస్.జయకుమార్, మరకతం కుమారవేల్, పి.సత్యభామ, ఇసక్కి సుబ్బయ్య, సి.విజయభాస్కర్, ఎంఆర్ విజయభాస్కర్ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి టీవీకేలో చేరారు. ఆ రాజీనామాలను అసెంబ్లీ స్పీకర్ వెంటనే ఆమోదించారు. దీనిపై ఎం.శ్రీనివాసన్ అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేల నుంచి ఎన్నికల ఖర్చును వసూలు చేసేలా, మళ్లీ జరగబోయే ఉప ఎన్నికల ఖర్చును కూడా ముందుగానే జమ చేసేలా ఆదేశించాలని అభ్యర్థించారు. ఆ ఆరుగురిపై ఐదేళ్లపాటు అనర్హత వేటువేయాలని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీ తప్పుకునేదే లేదు.. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్
SIR సహా అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నాము.. ఈసీ అఫిడవిట్