Share News

ఛత్తీస్‌గఢ్‌లో పేలిన మందుపాతర.. నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలు

ABN , Publish Date - Oct 09 , 2026 | 09:25 AM

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన సుక్మా జిల్లాలో మందుపాతర పేలుడు ఘటన ఆందోళనకు గురిచేసింది. పేలుడు పదార్థాన్ని నిర్వీర్యం చేసేందుకు వెళ్లిన బాంబ్‌ డిస్పోజల్‌ స్క్వాడ్‌ (BDS) బృందానికి ప్రమాదం ఎదురైంది. వివరాల్లోకి వెళితే..

ఛత్తీస్‌గఢ్‌లో పేలిన మందుపాతర.. నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలు
Chhattisgarh Landmine Blast

ఇంటర్నెట్ డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మందుపాతర పేలుడు కలకలం రేపింది. మందుపాతరను నిర్వీర్యం చేసే క్రమంలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించడంతో బాంబ్‌ డిస్పోజల్‌ స్క్వాడ్‌ (BDS) బృందానికి చెందిన నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బెజ్జి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బొడ్రాజదర్‌ కల్వర్టు వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మందుపాతరను గుర్తించిన అనంతరం దానిని నిర్వీర్యం చేసేందుకు వెళ్లిన బాంబు నిర్వీర్య బృందం సభ్యులు ఈ ప్రమాదానికి గురయ్యారు.


పేలుడులో గాయపడిన జవాన్లను వెంటనే సుక్మా జిల్లా కుంట ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించినట్లు సమాచారం. అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ప్రత్యేక చికిత్స అందించాల్సిన అవసరం ఉందని సమాచారం. అయితే, పేలుడుకు సంబంధించిన పూర్తి వివరాలు.. గాయపడిన జవాన్ల ఆరోగ్య పరిస్థితిపై అధికారిక సమాచారం వెల్లడికావాల్సి ఉంది.


ఈ వార్తలనూ చదవండి:

హైడ్రా బూచిగా అక్రమ వసూళ్లు

జలాధివాసం వీడుతున్న సంగమేశ్వరుడు!

Updated Date - Oct 09 , 2026 | 10:56 AM