Share News

అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌పై దాడి

ABN , Publish Date - Aug 14 , 2026 | 05:53 AM

శిరోమణి అకాలీదళ్‌ పార్టీ అధ్యక్షుడు, పంజాబ్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌పై దాడి జరిగింది. మహారాష్ట్ర, నాందేడ్‌లోని మాతాసాహెబ్‌ గురుద్వారా...

అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌పై దాడి

నాందేడ్‌, ఆగస్టు 13 : శిరోమణి అకాలీదళ్‌ పార్టీ అధ్యక్షుడు, పంజాబ్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌పై దాడి జరిగింది. మహారాష్ట్ర, నాందేడ్‌లోని మాతాసాహెబ్‌ గురుద్వారా వద్ద గురువారం మధ్యాహ్నం ఓ వ్యక్తి బాదల్‌పై కత్తి/బాకుతో డాడి చేశాడు. ఈ ఘటనలో బాదల్‌ కుడి చేతికి గాయమైంది. మహారాష్ట్ర పర్యటనలో ఉన్న బాదల్‌, తన భార్య, ఎంపీ హర్‌సిమ్రత్‌ కౌర్‌తో కలిసి నాందేడ్‌లోని మాతా సాహెబ్‌ గురుద్వారాను సందర్శించారు. అయితే, జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రతలో ఉన్న బాదల్‌ గురుద్వారా మెట్లు దిగుతుండగా.. సిక్కు సమాజంలో యోధుల వర్గమైన ‘నిహంగ్‌ సిక్కు’ వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి దాడి చేశాడు. గమనించిన భద్రతా సిబ్బంది అప్రమత్తమై దాడిని అడ్డుకున్నారు. కానీ, బాదల్‌ కుడి చేతికి కత్తిపోటు గాయమైంది. దాడిని అడ్డుకునేందుకు యత్నించే క్రమంలో బాదల్‌ భద్రతా సిబ్బందిలోని ఓ పోలీసు ్త కూడా గాయపడ్డారు. గాయపడిన బాదల్‌ను నాందేడ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. బాదల్‌కు ఎలాంటి ప్రాణాపాయం లేదని, ఆయన కుడి చేతికి గాయమైన చోట మూడు కుట్లు పడ్డాయని పోలీసులు వెల్లడించారు. ఇక, దాడికి పాల్పడిన నిహంగ్‌ సిక్కును పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఆ నిహంగ్‌ సిక్కును పుణెకు చెందిన జస్పాల్‌ సింగ్‌ అనే న్యాయవాదిగా గుర్తించారు. జస్పాల్‌ సింగ్‌ కొన్నేళ్ల క్రితమే నిహంగ్‌ సిక్కుగా మారినట్టు తెలిసింది. అయితే, సదరు నిహంగ్‌ సిక్కు.. బాదల్‌పై దాడి ఎందుకు చేశాడనేది తెలియాల్సి ఉంది. బాదల్‌పై 2024 డిసెంబరులోనూ ఓ సారి హత్యాయత్నం జరిగింది. అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం వెలుపల ఓ వ్యక్తి బాదల్‌పై కాల్పులు జరిపాడు. కానీ బుల్లెట్‌ గురి తప్పడంతో బాదల్‌ తప్పించుకున్నారు. కాగా, గురువారం నాటి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర సీఎం దేవేందర్‌ ఫడణవీస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. బాదల్‌ సతీమణి, ఎంపీ హర్‌సిమ్రత్‌ కౌర్‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారని, బాదల్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. హర్‌ సిమ్రత్‌ కౌర్‌ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్‌ హోదాలో ఉన్నారు. ఇక, బాదల్‌పై దాడి ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. అంతేకాక, బాదల్‌తో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

ఈ వార్తలు కూడా చదవండి

డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తే వదిలిపెట్టొద్దు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వండి: మంత్రులతో చంద్రబాబు..

అనుమతి లేకుండా ర్యాలీ.. 31మంది వైసీపీ నేతలపై కేసులు..

Updated Date - Aug 14 , 2026 | 05:53 AM