సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత
ABN , Publish Date - Aug 21 , 2026 | 02:56 PM
తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూశారు.
ఇంటర్‌నెట్ డెస్క్: తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా శుక్రవారం ఆమె చనిపోయారు. షావుకారు జానకి ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు ఆమెను చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 94 ఏళ్ల వయసులో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆమె తుది శ్వాస విడిచారు.
షావుకారు జానకి మరణంపై నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. షావుకారు జానకి భౌతికకాయాన్ని శుక్రవారం సాయంత్రం 5 గంటలనుంచి తేనామ్‌పేట్‌లోని సెనోటాఫ్ రోడ్‌లో.. అభిమానులు, స్నేహితులు, చిత్ర పరిశ్రమకు చెందిన వారు నివాళులు అర్పించటం కోసం ఉంచుతామని తెలిపారు.
70 ఏళ్ల సినీ ప్రస్థానం..
టేకుమళ్ల జానకి 1931 డిసెంబర్ 12వ తేదీన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో జన్మించారు. విజయవారి 'షావుకారు' సినిమాతో 1950లో జానకి సినీరంగ ప్రవేశం చేశారు. మొదటి సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. ‘షాపుకారు’ జానకిగా పాపులర్ అయ్యారు. జానకి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 380 చిత్రాలలో నటించారు. ఆమె చివరగా 2023లో వచ్చిన 'అన్నీ మంచి శకునములే' సినిమాలో కనిపించారు.
ఇవి కూడా చదవండి
జ్యుడీషియల్ సర్వీస్‌కు ప్రాక్టీస్ ఏడాదే.. సుప్రీం కీలక నిర్ణయం
ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే.. పీఎస్ ఎదుట రాహుల్ గాంధీ నిరసన