రేపే కేరళకు నైరుతి
ABN , Publish Date - Jun 03 , 2026 | 06:20 AM
నైరుతి రుతుపవనాలు గురువారం కేరళలోకి ప్రవేశించనున్నాయి. అదే రోజు తమిళనాడు, లక్షద్వీ్‌పలో పలు ప్రాంతాలు, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలకూ...
అదే రోజు తమిళనాడు, లక్షద్వీప్ ప్రాంతాలకు రుతు పవనాల విస్తరణ
కేరళకు అతిభారీ వర్షాల హెచ్చరిక
వచ్చే వారం దక్షిణాదిలో వర్షాలు: ఐఎండీ
నేడు, రేపు తెలంగాణలో మోస్తరు వానలు..
న్యూఢిల్లీ, జూన్ 2(ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు గురువారం కేరళలోకి ప్రవేశించనున్నాయి. అదే రోజు తమిళనాడు, లక్షద్వీ్‌పలో పలు ప్రాంతాలు, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలకూ విస్తరించనున్నాయి. ఈమేరకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) మంగళవారం ప్రకటించింది. కేరళ, లక్షద్వీ్‌పలలో గడిచిన రెండు, మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటం, కేరళకు ఆనుకుని అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఆవరించడంతో రుతుపవనాల రాకకు అనుకూలంగా ఉందని తెలిపింది. వచ్చే ఏడు రోజుల్లో కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, 7 నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశముందని హెచ్చరించింది. అలాగే, వచ్చే వారం దక్షిణాది రాష్ట్రాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వాయవ్య, మధ్య, తూర్పు, దక్షిణ భారతంలోని అనేక ప్రాంతాల్లో వచ్చే వారం మోస్తరు నుంచి తీవ్రంగా పిడుగులు పడే అవకాశముందని హెచ్చరించింది. సాధారణంగా జూన్ ఒకటో తేదీ నాటికి కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. అయితే ఈ ఏడాది మే 26 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని ఐఎండీ తొలుత ప్రకటించింది. ఆ తర్వాత దానిని సవరించి.. మే 28వ తేదీ నుంచి జూన్ మూడో తేదీ మధ్య రుతుపవనాలు రావడానికి అనుకూలమైన వాతావరణం ఉందని తెలిపింది. దానికంటే కూడా ఒకరోజు ఆలస్యంగా రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించనున్నట్టు తాజాగా వెల్లడించింది. ఇటు బుధ, గురువారాల్లో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రానున్న నాలుగు రోజుల్లో క్రమంగా 2 నుంచి 4 డిగ్రీల మేరకు తగ్గే అవకాశముందని వెల్లడించింది. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. నల్లగొండ జిల్లా కట్టంగూర్‌లో అత్యధికంగా 43.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవ్వగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాలలో అత్యధికంగా 2.3 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయ్యింది.
కేంద్రం నుంచి ఎల్‌నినో అలెర్ట్..
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావం సాధారణం కన్నా తక్కువగా ఉంటుందని, ఎల్‌నినో కారణంగా వర్షాలు తక్కువగా కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లాల్లో అత్యవసర ప్రణాళికలను వెంటనే అమలు చేయాలని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఢిల్లీలో వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు కేంద్రం, రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నాయని, ఎల్‌నినోపై వాతావరణ హెచ్చరికలపై రైతాంగం ఆందోళన చెందొద్దని చౌహాన్ పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు తక్కువ నీటితో పండే, త్వరగా చేతికొచ్చే పంటల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని రాష్ట్రాలకు సూచించారు. ఖరీ్‌ఫలో వర్షాలు ఆలస్యమైతే గనక ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు, అలాగే భూమిలోని తేమను కాపాడుకునేందుకు నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని, రిజర్వాయర్లలోని జలాలను పొదుపుగా వాడుకోవాలన్నారు. పంటలను ఆశించే చీడపీడలపై రైతులకు ముందుగానే సమాచారమందించేలా డిజిటల్ నెట్‌వర్క్, కాల్‌సెంటర్ సేవలను బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు.
Also Read:
ఖర్జూరాలు.. కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయా?
చిన్న పిల్లాడిలా మారి.. డ్యాన్స్ చేసిన విరాట్! వీడియో వైరల్...
For More Latest News