Share News

ఆ వార్తల్లో నిజం లేదు.. యూసుఫ్ పఠాన్‌తో సంప్రదింపులపై గంగూలీ ప్రకటన

ABN , Publish Date - Jun 06 , 2026 | 07:54 PM

యూసుఫ్ పఠాన్ తన ఎంపీ సీటుకు రాజీనామా చేసేలా ఒప్పించేందుకు మాజీ సీఎం మమత తరఫున తాను సంప్రదింపులు జరిపినట్టు వస్తున్న వార్తలను సౌరవ్ గంగూలీ స్పందించారు. ఈ కథనాల్లో ఎంతమాత్రం నిజం లేదని అన్నారు.

ఆ వార్తల్లో నిజం లేదు.. యూసుఫ్ పఠాన్‌తో సంప్రదింపులపై గంగూలీ ప్రకటన
Ganguly, Mamata Banerjee, Yusuf Pathan

ఇంటర్నెట్ డెస్క్: టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ కోసం ఎంపీ పదవికి రాజీనామా చేయాలంటూ యూసుఫ్‌ పఠాన్‌తో తాను సంప్రదింపులు జరిపినట్టు మీడియాలో వచ్చిన కథనాలపై మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ స్పందించారు. ఆ వార్తల్లో నిజం ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. వాస్తవాలు ఏమిటో తెలుసుకోకుండా వదంతులపై ఆధారపడవొద్దని మీడియాకు సూచించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేశారు.

తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమైనట్టు ఇటీవల జాతీయ మీడియాలో కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ దిశగా మార్గం సుగమం చేసేందుకు గంగూలీ రంగంలోకి దిగినట్టు ఒక బెంగాల్ పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. యూసుఫ్ ఫఠాన్‌తో తన ఎంపీ పదవికి రాజీనామా చేయించి ఆ స్థానం నుంచి టీఎంసీ చీ‌ఫ్‌‌కు ఎంపీగా ఛాన్స్ కల్పించేలా గంగూలీ సంప్రదింపులు జరిపినట్టు ప్రచురితమైన కథనం కలకలానికి దారి తీసింది.


దీంతో, గంగూలీ ఎక్స్ వేదికగా స్పందించారు. తాను మాజీ సీఎం మమత తరఫున యూసుఫ్‌తో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని అన్నారు. అసలు ఈ విషయంలో టీఎంసీ చీఫ్‌‌కు, తనకు మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని చెప్పారు. కాబట్టి మాజీ సీఎం సందేశాన్ని తాను యూసుఫ్‌కు చేరవేసే అవకాశమే లేదని స్పష్టం చేశారు. వాస్తవాలేమిటో తెలుసుకోకుండా మీడియా ఇలాంటి వదంతులను ప్రచురించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

వాస్తవాలను మీడియా సంస్థలు పక్కనపెడుతున్న వైనానికి ఈ కథనాలు అద్దం పడుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇలాంటి వార్తలను ప్రచురించే ముందు మీడియా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కథనాల్లో పేర్కొన్న వ్యక్తులెవరితోనూ తాను ఎలాంటి రాజకీయపరమైన చర్చలు చేపట్టలేదని స్పష్టం చేశారు. కాబట్టి, ఈ వదంతులకు చెక్ పెట్టేందుకు ప్రకటన విడుదల చేశానని అన్నారు. యూసుఫ్ పఠాన్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లోని బహరంపూర్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.


ఈ వార్తలనూ చదవండి:

అన్నామలైకి భారీగా మద్దతు.. ఏకంగా 14 లక్షల మంది..

అన్నామలై ఎఫెక్ట్.. రాజీనామాలు చేయవద్దని కోరిన నైనార్ నాగేంద్రన్

Updated Date - Jun 06 , 2026 | 08:20 PM