పశ్చిమాసియాలో భారత్ ప్రభావం తగ్గిపోయింది: సోనియా
ABN , Publish Date - Jun 27 , 2026 | 12:11 PM
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, పాలస్తీనా, గాజా సంక్షోభంపై కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తప్పుబట్టారు. మోదీ వహిస్తున్న రాతి మౌనం దేశ ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీస్తోందన్నారు.
న్యూఢిల్లీ, జూన్ 27: పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు.. పాలస్తీనా, గాజా సంక్షోభంపై కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానంపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక ఇంగ్లీష్ దినపత్రికకు రాసిన వ్యాసంలో ఆమె కేంద్ర ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు గుప్పించారు. పశ్చిమాసియా సంక్షోభంపై ప్రధాని మోదీ వహిస్తున్న 'రాతి మౌనం' దేశ ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని ఆమె ఆరోపించారు.
ఇన్నాళ్లూ పశ్చిమాసియా ప్రాంతంలో, గ్లోబల్ సౌత్ దేశాల్లో భారతదేశానికి ఉన్న సంప్రదాయ, చరిత్రాత్మక వ్యూహాత్మక ప్రాభవాన్ని ప్రస్తుత మోదీ ప్రభుత్వం పూర్తిగా బలహీనపరిచిందని సోనియా గాంధీ విమర్శించారు. గాజాలో ఇజ్రాయెల్ దాడుల వల్ల వేలాది మంది అమాయక పిల్లలు, పౌరులు ప్రాణాలు కోల్పోతున్నా, వెస్ట్ బ్యాంక్‌లో లక్షలాది పాలస్తీనా కుటుంబాలు బలైపోతున్నా భారతదేశం నిశ్శబ్ద ప్రేక్షక పాత్రకే పరిమితమైందన్నారు.
'పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు భారత్ ఒక కీలక దౌత్య పాత్ర పోషించే అద్భుతమైన అవకాశం ఉన్నప్పటికీ, మోదీ ప్రభుత్వం దానిని చేజేతులా వదిలేసింది. ఈ వ్యూహాత్మక మౌనాన్ని అటు నైతికంగా గానీ, ఇటు దేశ ప్రయోజనాల పరంగా గానీ సమర్థించలేం'. అని సోనియా గాంధీ అన్నారు.
పాకిస్థాన్ చేతికి చిక్కిన అవకాశం!
భారత్ వహించిన మౌనాన్ని ఆసరాగా చేసుకుని, మన పొరుగు దేశమైన పాకిస్థాన్ పశ్చిమాసియా శాంతి చర్చల్లో చొరవ తీసుకుని తన ప్రభావాన్ని అంతర్జాతీయంగా పెంచుకుందని సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ ఆ ప్రాంతంలో తన పాత మిత్రదేశాలైన పాలస్తీనా, ఇరాన్ వంటి దేశాలకు క్రమంగా దూరమవుతూ, ఇజ్రాయెల్ వ్యూహాత్మక వలలోకి పూర్తిగా జారిపోతోందని ఆమె విమర్శించారు.
సోనియా గాంధీ వ్యాసానికి ఖర్గే, రాహుల్ మద్దతు
సోనియా గాంధీ వ్యక్తపరిచిన ఈ ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు గట్టి మద్దతు పలికారు. సోనియా రాసిన భావోద్వేగభరితమైన వ్యాసం మోదీ ప్రభుత్వ ఉదాసీనతను ఎత్తిచూపిందని, ప్రపంచ ప్రజాభిప్రాయానికి భిన్నంగా భారత్ ఒంటరిగా మారుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే 'X' (ట్విట్టర్) లో పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ చర్యలను తప్పుబడుతుంటే, భారత్ మాత్రం ఆ దేశానికి రాజకీయ మద్దతు ఇవ్వడం విడ్డూరంగా ఉందని, భారత్ తన సొంత స్వతంత్ర విదేశాంగ విధానాన్ని తిరిగి పునరుద్ధరించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి