తల్లి కష్టాలను గుర్తు చేసుకున్న రాహుల్ గాంధీ.. సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు
ABN , Publish Date - Aug 20 , 2026 | 04:00 PM
తన తల్లి సోనియా గాంధీ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకుంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్టు పెట్టారు.
ఇంటర్నెట్ డెస్క్: సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తన తల్లి సోనియా గాంధీ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకుంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్టు పెట్టారు. తన తండ్రి రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ పోస్టు షేర్ చేశారు. తల్లిని చూస్తూ ప్రస్తుతం తన తండ్రి గర్వపడుతుంటారని వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ కూడా తన మనుసులో మాటను నెట్టింట పంచుకున్నారు.
35 ఏళ్ల క్రితం తల్లిదండ్రులిద్దరినీ చివరిసారిగా చూశానని రాహుల్ గాంధీ భావోద్వేగానికి గురయ్యారు. 1991లో రాజీవ్ గాంధీ హత్యానంతరం సోనియా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారంటూ భావోద్వేగానికి గురయ్యారు. సవాళ్లను హుందాగా ఎదుర్కొని అధిగమించారని ప్రశంసించారు. తమ తల్లి జీవితంలో ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల గురించి తనకు, తన సోదరి ప్రియాంకకు మాత్రమే తెలుసునని అన్నారు. వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడూ బహిరంగంగా పెద్దగా మాట్లాడని తన తల్లి ఆ విశేషాలను పుస్తక రూపంలో పంచుకునేందుకు ముందుకు రావడం చూసి తానెంతో గర్వపడుతున్నానని వ్యాఖ్యానించారు.
తన తల్లిదండ్రులది అద్భుతమైన ప్రేమబంధమని ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. హృదయంలోని భావోద్వేగాలకు నిజాయతీతో అక్షర రూపం ఇచ్చిన తన తల్లిని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని అన్నారు. ఎంతో సహృదయంతో వ్యవహరించే తన తల్లి అవసరమైన సందర్భల్లో ధీరవనితగా మారిపోతుందని కూడా ప్రశంసలు కురిపించారు. ఇప్పటివరకూ సోనియా గాంధీని రాజకీయ నేతగా మాత్రమే చూసిన వారికి ఈ పుస్తకంతో ఆమె వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకునే అవకాశం దక్కుతుందని అన్నారు. సోనియా గాంధీ జీవితం ఆమెకు దేశంపై కుటుంబంపై ఉన్న ప్రేమకు తార్కాణంగా నిలుస్తోందని వ్యాఖ్యానించారు. ఇక ఈ పుస్తకం నవంబర్ 10న విడుదల కానుంది.
ఈ వార్తలనూ చదవండి:
సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు దోషి సజ్జన్ కుమార్ మృతి.. తిహార్ జైల్లో కన్నుమూత
'వందేమాతరం'పై కాంగ్రెస్ నిర్ణయం దేశాన్ని అవమానించడమే: అమిత్‌షా