Share News

సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు దోషి సజ్జన్ కుమార్ మృతి.. తిహార్ జైల్లో కన్నుమూత

ABN , Publish Date - Aug 20 , 2026 | 03:04 PM

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యానంతరం జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ (80) కన్నుమూశారు.

సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు దోషి సజ్జన్ కుమార్ మృతి.. తిహార్ జైల్లో కన్నుమూత
Sajjan Kumar dies in Tihar Jai

ఇంటర్నెట్ డెస్క్: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యానంతరం జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ (80) కన్నుమూశారు. ఢిల్లీలోని తీహార్ జైల్‌లో ఉన్న ఆయనను గురువారం సఫ్దర్‌‌జంగ్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు తెలిపారు. సజ్జన్ మృతికి గల కారణాలు ఆసుపత్రి వర్గాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1984లో సిక్కు మతస్తులైన తన బాడీ గార్డుల చేతిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆ తరువాత ఢిల్లీ సహా ఉత్తరాదిన పలు ప్రాంతాల్లో సిక్కులపై భారీ స్థాయిలో మూక దాడులు జరిగాయి. ఇందుకు సంబంధించి కొన్ని కేసుల్లో సజ్జన్ కుమార్ దోషిగా తేలారు. ఈ దాడుల్లో సిక్కుల వ్యాపారాలు, నివాససముదాయాలపై దాడులు జరిగాయి. అనేక మంది కన్నుమూశారు. అధికారిక గణాంకాల ప్రకారం, నాటి దాడుల్లో 3 వేల పైచిలుకు మంది కన్నుమూశారు.


పలామ్ కాలనీ ఏరియాలో జరిగిన ఐదుగురి హత్య ఉదంతంలో ఢిల్లీ హైకోర్టు సజ్జన్ కుమార్‌ను 2018లో దోషిగా తేల్చింది. యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఆ తరువాత ఢిల్లీ సారస్వత్ నగర్‌లో ఇద్దరు సిక్కుల హత్య కేసులో ఢిల్లీ హైకోర్టు 2025లో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే, ఢిల్లీలోని జనక్‌పురి, వికాస్‌పురి ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనల కేసులో మాత్రం సజ్జన్ పాత్రను నిరూపించే ఆధారాలు లేకపోవడంతో కోర్టులో విముక్తి లభించింది.

జాట్ వర్గం కీలక నేత సజ్జన్ కుమార్ 1980ల్లో ఢిల్లీ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. 1977లో స్థానిక కౌన్సిలర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన ఆ తరువాత ఔటర్ ఢిల్లీ నియోజకర్గం నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచారు.


ఈ వార్తలనూ చదవండి:

ఇన్‌ఫ్లుయెన్సర్లకు బీహార్ ప్రభుత్వం బంపరాఫర్.. రూ. 1 లక్ష వరకు సంపాదించే ఛాన్స్!

'వందేమాతరం'పై కాంగ్రెస్ నిర్ణయం దేశాన్ని అవమానించడమే: అమిత్‌షా

Updated Date - Aug 20 , 2026 | 03:18 PM