20వ తేదీ వరకూ ప్రాణాలతో ఉంటా!
ABN , Publish Date - Jul 18 , 2026 | 06:07 AM
శరీరం కృశించిపోతున్నా లెక్కచేయకుండా ఆమరణ దీక్షను కొనసాగిస్తున్న విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్.. ఈ నెల 20వ తేదీన జరుపతలపెట్టిన...
ఆ రోజున పార్లమెంటు వద్దకు జరిగే ర్యాలీని విజయవంతం చేద్దాం
బయటకు బలహీనంగా ఉన్నా లోపల
దృఢంగా ఉన్నా: సోనమ్ వాంగ్‌చుక్
న్యూఢిల్లీ, జూలై 17: శరీరం కృశించిపోతున్నా లెక్కచేయకుండా ఆమరణ దీక్షను కొనసాగిస్తున్న విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్.. ఈ నెల 20వ తేదీన జరుపతలపెట్టిన జంతర్‌మంతర్-పార్లమెంటు ర్యాలీ వరకూ ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలతో ఉంటానని తెలిపారు. శుక్రవారంఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఉన్న దీక్ష శిబిరానికి వచ్చిన మద్దతుదారులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నేను బయటకు బలహీనంగా ఉన్నా.. అంతర్గతంగా చాలాదృఢంగా ఉన్నా. మీరందరూ అంతర్గతంగా, బహిర్గతంగా కూడా దృఢంగానే ఉన్నారని ఆశిస్తున్నా. ఈ నెల 20వ తేదీన పార్లమెంటు వరకూ జరిపే శాంతియుత ర్యాలీ కోసం ఈ శక్తి మనకు అవసరం. ప్రజాస్వామ్య దేవాలయం (పార్లమెంటు) వరకూ మనమందరం వెళ్లి అక్కడ మన విజ్ఞప్తులను సమర్పిద్దాం. ఆ రోజు వరకూ నేను కచ్చితంగా ప్రాణాలతో ఉంటా. మీరు రాకపోతే ఆ ర్యాలీ విజయవం తం కాదు. నేను దయ్యమై వస్తా’ అని చెప్పారు. అంత బలహీనంగా ఉన్న స్థితిలోనూ ‘దయ్యమై వస్తా’నంటూ వాంగ్‌చుక్ చేసిన సరదా వ్యాఖ్యతో అక్కడున్నవాళ్లు నవ్వులు చిందించారు. కాగా, శుక్రవారానికి నిరాహార దీక్ష 20వ రోజుకు చేరుకుంది. వాంగ్‌చుక్ ఆరోగ్యం తీవ్రంగా కృశిస్తోందని, దీక్ష ఇంకా కొనసాగితే ఆయన శరీరంలో కీలక అవయవాలు పని చేయటం మానేసే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. వాంగ్‌చుక్ 9.5 కిలోల బరువు కోల్పోయి 56.55 కిలోల బరువుతో ఉన్నారని, డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తున్నాయని, కానీ, మానసికంగా స్థిరంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ నేత పవన్‌ఖేరా శుక్రవారం వాంగ్‌చుక్‌ను కలిసి ఆయన పోరాటానికి పార్టీ తరఫున మద్దతు ప్రకటించారు. దీనిపై ఎక్స్‌లో ఒక ప్రకటన చేస్తూ.. ‘ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన రాజ్యాంగబద్ధమైన హక్కు. తమ డిమాండ్లను వినిపించాలని పౌరులు నిరాహారదీక్ష చేపడితే ప్రభుత్వం వాటిని వినాలి. అదే రాజధర్మం. 1984లో ఇందిరాగాంధీ, 2011లో మన్మోహన్‌సింగ్ ప్రభుత్వాలు ఈ ధర్మాన్ని నిర్వర్తించాయి. కానీ, ప్రస్తుత ప్రభుత్వం అటువంటిది కాదు. విద్యారంగంలో సంస్కరణల కోసం కాంగ్రె్‌సతోపాటు ఎవరు ఉద్యమించినా పట్టించుకోవటం లేదు. ఇది అహంకారం మాత్రమే కాదు.. క్రూరమైన నిర్లక్ష్యం. ఇదసలు ప్రజాస్వామ్యమే కాదు’ అని పేర్కొన్నారు. విషమిస్తున్న ఆరో గ్యం దృష్ట్యా దీక్షను విరమించుకోవాలని వాంగ్‌చుక్‌ను కోరానని తెలిపారు. దీక్షను విరమించుకోవలసిందిగా సోనమ్ వాంగ్‌చుక్‌కు శుక్రవారం పలువురు విద్యావేత్తలు, సినీ ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు.
‘త్రీ ఇడియట్స్’కు వాంగ్‌చుక్
జీవితం ఆధారం కాదు: ఆమిర్‌ఖాన్
‘త్రీ ఇడియట్స్’ సినిమాను ముఖ్యంగా కథానాయకుడు ఫున్‌సుఖ్ వాంగ్డూ పాత్రను సోనమ్ వాంగ్‌చుక్ జీవితం ఆధారంగా రూపొందించారన్నది వాస్తవం కాదని బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్ తెలిపారు. ఆ సినిమా నిర్మాణం అవుతున్నప్పుడు తనకుగానీ, దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీకిగానీ, రచయిత అభిజిత్ జోషికిగానీ సోనమ్ వాంగ్‌చుక్ గురించి తెలియదని చెప్పారు. అయితే వాంగ్‌చుక్ కృషి గొప్పదని, దానికి ఆయనను అందరూ గౌరవిస్తారని తెలిపారు. నిరాహారదీక్ష గురించి స్పందిస్తూ.. వాంగ్‌చుక్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా విలేకరుల ప్రశ్నలకు ఆయన ఈ సమాధానాలిచ్చారు. ఆ వ్యాఖ్యలను కాంగ్రెస్, ఆప్, ఆర్జేడీ పార్టీలకు చెందిన నేతలు ఖండించారు. కేంద్రానికి భయపడి అలా మాట్లాడారని విమర్శించారు.
ఇవి కూడా చదవండి
తప్పిపోయిన 35 ఏళ్ల తర్వాత.. అమ్మకు దగ్గరైన కూతురు