క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం
ABN , Publish Date - Jul 14 , 2026 | 06:11 AM
నీట్ తదితర పరీక్షల్లో అక్రమాలు, ప్రశ్నపత్రాల లీకేజీల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 16 రోజులుగా నిరవధిక నిరాహారదీక్షలో...
16వ రోజుకు చేరిన నిరవధిక నిరాహారదీక్ష
న్యూఢిల్లీ, జూలై 13: నీట్ తదితర పరీక్షల్లో అక్రమాలు, ప్రశ్నపత్రాల లీకేజీల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 16 రోజులుగా నిరవధిక నిరాహారదీక్షలో ఉన్న విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు, ప్రతిష్ఠాత్మక రామన్ మెగసెసే పురస్కార గ్రహీత సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణిస్తోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహారదీక్ష ప్రారంభించినప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఆయన 8.2 కిలోల బరువు తగ్గారు. సోమవారం వాంగ్‌చుక్ రక్తంలో షుగర్ నిల్వలు 67 ఎంజీ/డీఎల్‌కు పడిపోయాయని, బీపీ 107/70 ఎంఎం హెచ్‌జీగా నమోదైందని వైద్యులు వెల్లడించారు. వాంగ్‌చుక్ ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే విలేకరులతో మాట్లాడుతూ.. ‘మనుష్యుల జీవితాలు రిస్క్‌లో ఉన్నాయి. దయచేసి ఈ అంశాన్ని ఇగోల(అహంకారాల) యుద్ధంగా మలచకండి. జరిగిన పొరపాటును అంగీకరించటం బలహీనతేమీ కాదు. మేమంతా మీ నుంచి ఆశిస్తున్నది జవాబుదారీతనం మాత్రమే’ అంటూ కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తన కృషి ద్వారా దేశానికి అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన వాంగ్‌చుక్ ఈ రోజు ఈ దేశ విద్యార్థుల కోసం పోరాడుతుంటే ఆయనతో మాట్లాడటానికి ప్రభుత్వం కనీసం ఒక్క మంత్రినైనా పంపించలేదని, ఇదేం ప్రభుత్వమని నిలదీశారు. 2011లో అన్నాహజారే చేసిన 12 రోజుల నిరాహారదీక్షను విలేకరులు ప్రస్తావించగా.. నాటి భారతదేశం వేరు..నేటి భారత్‌లో మనుష్యుల ప్రాణాలకు విలువ లేదు అంటూ దీప్తే జవాబిచ్చారు.
24 రోజులుగా నిరసనోద్యమం
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున కేంద్రప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీజేపీ జంతర్‌మంతర్ వద్ద జూన్ 20వ తేదీ నుంచి నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తోంది. వీటికి మద్దతుగా సోనమ్ వాంగ్‌చుక్ అదే నెల 28వ తేదీ నుంచి నిరవధిక నిరాహారదీక్షను ప్రారంభించారు. సీజేపీ నిరసన ప్రారంభమై 24 రోజులవుతోంది. నిరసనోద్యమాన్ని ఉధృతం చేయటానికి ఈ నెల 20వ తేదీన పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే రోజున.. జంతర్‌మంతర్ నుంచి పార్లమెంటు వరకూ శాంతియుత ప్రదర్శనను నిర్వహిస్తామని సీజేపీ ఇప్పటికే ప్రకటించింది. కాగా, మరో నలుగురు విద్యార్థులు కూడా జంతర్‌మంతర్ వద్ద విడిగా గత 16 రోజులుగా నిరవధిక నిరాహారదీక్షను కొనసాగిస్తున్నారు.
సంఘీభావం ప్రకటించిన నేతలు
వాంగ్‌చుక్‌ను, విద్యార్థినేతలను సోమవారం ఆప్ నేత, ఢిల్లీ మాజీ సీఎం ఆతిషి, సీపీఎం ఎంపీ ఆమ్రారామ్, ఏపీ, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన సీపీఎం నేతలు సందర్శించారు. సీజేపీ డిమాండ్లకు మద్దతు ప్రకటించారు. కొన్ని వారాలుగా విద్యార్థులు నిరాహారదీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవటం దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా ఉందో తెలియజేస్తుందని ఆతిషి వ్యాఖ్యానించారు. వాంగ్‌చుక్, సీజేపీ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాకరే ప్రకటించారు. కేంద్రప్రభుత్వం పూర్తి నిర్లక్ష్య వైఖరితో ఉన్నందున.. వాంగ్‌చుక్ నిరవధిక నిరాహారదీక్షను విరమించుకోవాలని, ఆయన జీవితం ఎంతో విలువైనదని ఉద్ధవ్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
దేవాలయాల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు: మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్‌లో ఈగల్ ఫోర్స్ మెగా ఆపరేషన్..
Read Latest AP News And Telangana News And National News
And Telugu News