నిరశన ముగిసింది...
ABN , Publish Date - Jul 25 , 2026 | 06:17 AM
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలకు, పరీక్ష విధానంలో సంస్కరణలు కోరుతూ నిరాహార దీక్ష చేపట్టిన సోనమ్ వాంగ్‌చుక్ గురువారం అర్ధరాత్రి తన దీక్షను విరమించారు...
జవాబుదారీతనం మొదలైంది
26 రోజుల దీక్ష విరమణ తర్వాత వాంగ్ చుక్ వ్యాఖ్య
కేంద్రం లిఖిత పూర్వక హామీలు ఇచ్చినందువల్లే దీక్ష
విరమించినట్టు ప్రకటన
న్యూఢిల్లీ, జూలై 24: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలకు, పరీక్ష విధానంలో సంస్కరణలు కోరుతూ నిరాహార దీక్ష చేపట్టిన సోనమ్ వాంగ్‌చుక్ గురువారం అర్ధరాత్రి తన దీక్షను విరమించారు. 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన వాంగ్‌చుక్‌కు ఆహారాన్ని అందజేసిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా దీక్షను విరమింపజేశారు. ఆ సమయంలో మంత్రి జితేందర్ సింగ్, సోనమ్ భార్య గీతాంజలి అక్కడే ఉన్నారు. ‘‘నిరశన ముగిసింది.. జవాబుదారీతనం మొదలైంది’’ అని పేర్కొంటూ సోషల్ మీడియాలో శుక్రవారం ఓ వీడియో పోస్టు చేసిన వాంగ్‌చుక్.. దీక్ష విరమణకు కారణాలను, ప్రభుత్వం తనకు లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలను అందులో వివరించారు. ‘‘కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేందర్ సింగ్ కొద్దిసేపటి క్రితమే నాతో మాట్లాడారు. కేంద్రప్రభుత్వం నాకు మూడు లిఖితపూర్వక హామీలు ఇచ్చింది. పరీక్షల నిర్వహణ విధానంలో జవాబుదారీతనం అంశంపై పార్లమెంట్‌లో చర్చించడం అందులో మొదటిది. నీట్- యూజీ ప్రశ్నపత్రం లీకేజీ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వడం రెండోది. ఇక, న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళనలు చేపట్టిన విద్యార్థులపై కేసులు నమోదు చేయబోమనేది మూడో హామీ’’ అని సోనమ్‌వాంగ్ చుక్ ఆ వీడియోలో పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన ఈ హామీలను సోనమ్ వాంగ్‌చుక్‌కు కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్వయంగా చదివి వినిపించారు. అనంతరం ఓ కప్పులోని ఆహారాన్ని సోనమ్‌కు అందించి దీక్ష విరమింపజేసిన దృశ్యాలు వీడియోలో కనిపించాయి. తర్వాత కేంద్ర మంత్రులకు వాంగ్‌చుక్ ధన్యవాదాలు తెలియజేశారు. ఇక, తన భర్త నిరాహార దీక్షను విమరించడంపై గీతాంజలి ఆనందం వ్యక్తం చేశారు. అయితే, విద్యార్థుల ఉద్యమాన్ని స్వార్థానికి వినియోగించుకునేందుకు కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, వాంగ్‌చుక్ నిరాహార దీక్షను విరమించడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. సోనమ్ ఆరోగ్యం కోసం భగవంతుడిని ప్రార్థిస్తానని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక సమస్యలపై దృష్టి పెట్టండి.. జనసేన నేతలకు మంత్రి మనోహర్ సూచన
అమరావతి ఎన్‌జీఓ టవర్స్ నిర్మాణ పనుల్లో మరో ముందడుగు
Read Latest AP News And Telugu News