సబ్బులు, షాంపూలు, టూత్‌పేస్టులపై వెజ్, నాన్‌వెజ్ గుర్తులు.. కేంద్రం కొత్త నిబంధనలు..
ABN , Publish Date - Sep 22 , 2026 | 12:37 PM
సబ్బులు, షాంపూలు, టూత్‌పేస్టులు, ఇతర సౌందర్య సాధనాలు వంటి ఉత్పత్తుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు తీసుకొచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: సబ్బులు, షాంపూలు, టూత్‌పేస్టులు, ఇతర సౌందర్య సాధనాలు వంటి ఉత్పత్తుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు తీసుకొచ్చింది. ఇకపై ఈ ఉత్పత్తుల ప్యాకేజింగ్‌పై అవి శాకాహార మూలానికి చెందినవా లేదా మాంసాహార మూలానికి చెందినవా అనే విషయాన్ని తెలియజేసే గుర్తులు తప్పనిసరిగా ఉండాలి. కేంద్రం లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీస్) రూల్స్, 2011కు సవరణలు చేసి ఈ మార్పును ప్రవేశపెట్టింది (Soap veg non veg label).
ఈ నిబంధనలు సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఇకపై, సబ్బులు, షాంపూలు లేదా టూత్‌పేస్ట్ కొనుగోలు చేసేటప్పుడు ప్యాకేజింగ్‌పై ఉన్న ఆకుపచ్చ, ఎరుపు లేదా గోధుమ రంగు గుర్తుల ఆధారంగా ఉత్పత్తి మూలాన్ని గుర్తించవచ్చు. శాకాహార మూలానికి చెందిన ఉత్పత్తుల ప్యాకేజింగ్‌పై ఆకుపచ్చ రంగు ఉంటుంది. మాంసాహార మూలానికి చెందిన ఉత్పత్తులకు ఎరుపు లేదా గోధుమ రంగు గుర్తు ఉంటుంది. ఈ గుర్తును ప్యాకేజీ పైభాగంలో ఉంచాలి (Vegetarian non vegetarian products).
ఇప్పటివరకు సబ్బులు, షాంపూలు, టూత్‌పేస్టుల తయారీలో ఉపయోగించే పదార్థాల మూలాన్ని తెలుసుకోవాలంటే వినియోగదారులు ప్యాకేజింగ్‌పై ఉన్న పదార్థాల జాబితాను పరిశీలించాల్సి వచ్చేది (Green dot red dot). కొత్త నిబంధన ప్రకారం, రంగు గుర్తులతో ఉత్పత్తి శాకాహార మూలానికి చెందినదా, మాంసాహార మూలానికి చెందినదా అనే విషయాన్ని సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
ఆ మీడియా సంస్థలు కేన్సర్‌లాంటివి.. ట్రంప్ తీవ్ర విమర్శలు..
మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..