Share News

సిద్దూ.. తప్పుకో!

ABN , Publish Date - May 27 , 2026 | 04:08 AM

కర్ణాటక ప్రభుత్వంలో నాయకత్వ మార్పు అంశాన్ని కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎటూ తేల్చలేకపోయింది. ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు రాజ్యసభ సీటు, ఆయన కుమారుడికి...

సిద్దూ.. తప్పుకో!

  • కర్ణాటక సీఎం పదవిని వీడాలన్న కాంగ్రెస్‌ అధిష్ఠానం

  • 8 గంటల సుదీర్ఘ చర్చలు.. ఆఫర్లకు సీఎం ససేమిరా

  • రాహుల్‌ నచ్చజెప్పినా అంగీకరించని సిద్దరామయ్య

  • అనుచరులతో చర్చించి చెబుతానని సమాధానం

  • చర్చలు ముగిశాక ఉత్సాహంగా కనిపించిన డీకే శివకుమార్‌

బెంగళూరు, న్యూఢిల్లీ, మే 26 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక ప్రభుత్వంలో నాయకత్వ మార్పు అంశాన్ని కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎటూ తేల్చలేకపోయింది. ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు రాజ్యసభ సీటు, ఆయన కుమారుడికి ఉపముఖ్యమంత్రి పదవి సహా పలు ఆఫర్లను అధిష్ఠానం ప్రతిపాదించినా సీఎం సీటు వీడేందుకు సిద్దరామయ్య ససేమిరా అన్నట్టు తెలిసింది. మరోవైపు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ కూడా ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబట్టినట్టు సమాచారం. దీంతో ఏ ఫలితం తేలకుండానే ఢిల్లీలో అధిష్ఠానం చర్చలు ముగిశాయి. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఆహ్వానంతో సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌ ఢిల్లీకి వెళ్లారు. ఏఐసీసీ కార్యాలయంలోని ఇందిరాభవన్‌లో మంగళవారం ఉదయం విడతలవారీగా చర్చలు సాగాయి. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్‌, సుర్జేవాలాతో ఏకంగా 8 గంటలపాటు చర్చలు కొనసాగాయి. తొలుత అగ్రనేతలు మాత్రమే చర్చలు జరిపారు. ఆ తర్వాత సిద్దరామయ్యను ఆహ్వానించారు. ఐదుగురు కీలకనేతల మధ్య సుమారు 45 నిమిషాలకుపైగా చర్చలు జరిగాయి. స్పష్టత రాకపోవడంతో మధ్యాహ్న భోజనానికి విరామం ఇచ్చారు. రాహుల్‌గాంధీ ఇంటికి వెళ్లిపోగా, మిగిలినవారంతా ఇందిరాభవన్‌లోనే ఉండిపోయారు. మధ్యాహ్నం తర్వాత ఏఐసీసీ భవన్‌కు చేరుకున్న రాహుల్‌గాంధీ సిద్దరామయ్యతో వ్యక్తిగతంగా చర్చించారు. సుమారు అరగంటపాటు రాహుల్‌గాంధీ, సిద్దరామయ్య మాత్రమే ఉన్నారు. రాహుల్‌ చేసిన పలు ప్రతిపాదనలను సిద్దరామయ్య అంగీకరించలేదని తెలుస్తోంది. ఆ తర్వాత రెండో విడత అగ్రనేతలు సిద్దరామయ్యతో మరోసారి చర్చలు సాగించారు. అయినా స్పష్టత రాలేదు. అప్పటివరకు వేచియున్న డీసీఎం డీకే శివకుమార్‌ను పిలిపించారు. సిద్దరామయ్య లేకుండా డీకే శివకుమార్‌తో నేతలు చర్చించారు. ‘మీ ఆదేశాలు పాటించాను. మూడేళ్లుగా ఏ విషయంలోనూ పరిధి దాటలేదు. క్లిష్ట సమయంలోనూ మౌనంగా ఉన్నాను’ అని డీకే శివకుమార్‌ తన వాదన వినిపించినట్లు సమాచారం. ఇలా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటలదాకా సాగిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో అంతటితో ముగించారు. చర్చలు ముగిశాక సీఎం సిద్దరామయ్య ముభావంగా కనిపించారు. అనంతరం కేసీ వేణుగోపాల్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యసభ, విధానపరిషత్‌ ఎన్నికల గురించి మాత్రమే చర్చలు జరిపామని చెప్పారు. నాయకత్వ మార్పుపై మీడియా పలు ప్రశ్నలు సంధించగా, అలాంటిదేమీ లేదన్నారు. సీఎం, డీసీఎం మీడియాతో మాట్లాడేందుకు ఆసక్తి చూపలేదు. కాగా, ముఖ్యమంత్రి సిద్దరామయ్య గురువారం(ఈనెల 28న) రాజీనామా చేస్తారని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు చెప్పినట్టు ‘ఇండియా టుడే’ తెలిపింది.


సీఎంగానే ఉంటా.. రాజ్యసభకు రాను: సిద్దూ

తాను కర్ణాటక సీఎంగానే కొనసాగుతానని రాజ్యసభకు వచ్చేందుకు సిద్ధంగా లేనని సిద్దరామయ్య కాంగ్రెస్‌ అధిష్టానానికి స్పష్టం చేసినట్లు తెలిసింది. సిద్దరామయ్యకు రాజ్యసభ సీటు ఇస్తామని, శివకుమార్‌కు సీఎం పదవి ఇవ్వాలని వచ్చిన ప్రతిపాదనకు ఆయన నో అన్నట్లు సమాచారం. సిద్దరామయ్య కుమారుడు. ప్రస్తుత ఎమ్మెల్సీ యతీంద్రకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు కూడా అధిష్ఠానం సిద్ధమైనట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనలను తిరస్కరించిన సిద్దరామయ్య తనకు జాతీయ స్థాయి రాజకీయాల్లో ఆసక్తి లేదని, హిందీ కూడా రాదని చెప్పినట్లు సమాచారం. తన ఆప్తులతో చర్చించి చెబుతానని నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం పదవి వదులుకోకూడదని ఆయన వర్గం చెప్పినట్లు తెలిసింది.

ఆప్తులతో సిద్దరామయ్య చర్చలు

పెద్దలతో చర్చలు ముగిశాక ఢిల్లీలోని మంత్రి జార్జ్‌ నివాసానికి సిద్దరామయ్య చేరుకున్నారు. అక్కడ తన ఆప్తులైన మంత్రులు పరమేశ్వర్‌, మహదేవప్ప, బైరతి సురేశ్‌, ఎంబీ పాటిల్‌, మరో పదిమందితో అత్యవసర భేటీ నిర్వహించారు. ఈ చర్చలు ముగిశాక ఉత్సాహంగా కనిపించిన డీకే శివకుమార్‌, సోదరుడు సురేశ్‌తో కలసి కర్ణాటక భవన్‌కు చేరుకున్నారు. మీడియా వెంటపడగా, తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనన్నారు.

Updated Date - May 27 , 2026 | 05:54 AM