తప్పుదోవ పట్టించారు
ABN , Publish Date - Aug 06 , 2026 | 05:45 AM
బంగ్లాదేశ్‌లో 2024లో జరిగిన విద్యార్థుల తిరుగుబాటు వెనుక పెద్ద కుట్ర ఉందని ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా ఆరోపించారు. కొన్ని వ్యవస్థీకృత ముఠాలు విద్యార్థులను...
కావాలనే విద్యార్థుల భావోద్వేగాలను రెచ్చగొట్టారు
బంగ్లాదేశ్‌లో విద్యార్థుల తిరుగుబాటుపై షేక్ హసీనా
డిసెంబరులో బంగ్లాదేశ్‌కు వెళ్తా.. దేనికైనా సిద్ధమే
విలేకర్ల సమావేశంలో వెల్లడి
హసీనా సమావేశంతో మాకు సంబంధం లేదు: భారత్
న్యూఢిల్లీ, ఆగస్టు 5: బంగ్లాదేశ్‌లో 2024లో జరిగిన విద్యార్థుల తిరుగుబాటు వెనుక పెద్ద కుట్ర ఉందని ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా ఆరోపించారు. కొన్ని వ్యవస్థీకృత ముఠాలు విద్యార్థులను భావోద్వేగంగా రెచ్చగొట్టి.. వారి ఉద్యమాన్ని రాజకీయ తిరుగుబాటుగా మార్చేశాయన్నారు. ఏదేమైనా తన దేశ ప్రజల కోసం తాను డిసెంబరులో స్వదేశానికి తిరిగి వెళ్తానని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్(ఎ్‌ఫసీసీ) ఆఫ్ సౌత్ ఏషియా ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని ఎఫ్‌సీసీలో బుధవారం ఓ కార్యక్రమం జరిగింది. ఇందులో షేక్ హసీనా వర్చువల్‌గా విలేకరులతో మాట్లాడారు. బంగ్లాదేశ్‌ను వీడిన తర్వాత హసీనా మాట్లాడిన తొలి విలేకరుల సమావేశం ఇదే. అయితే, ఈ వర్చువల్ సమావేశంలోనూ హసీనా తన వీడియోను ఆపేసి కేవలం మాటలను మాత్రం వినిపించారు. 2024లో విద్యార్థుల ఆందోళనలు మొదలైనప్పుడు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని తమ ప్రభుత్వం భావించిందని తెలిపారు. కానీ, కొన్ని వ్యవస్థీకృత ముఠాలు ఈ ఆందోళనలను హింసాత్మక రాజకీయ తిరుగుబాటుగా మార్చేశాయని ఆరోపించారు. స్వదేశానికి తిరిగి వెళ్తే ఎదురయ్యే పరిస్థితులపై తనకు అవగాహన ఉందన్నారు. తనని చంపడమో, జైలులో పెట్టడమే చేస్తారని తెలుసునన్నారు. కానీ, ప్రజల కోసం తన కర్తవ్యాన్ని మరచిపోనని పేర్కొన్నారు. కాగా, బంగ్లాదేశ్ భారత్‌కు మరో పాకిస్థాన్ కాబోతోందని షేక్ హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ హెచ్చరించారు. బుధవారం నాటి సమావేశంలో షేక్ హసీనా కంటే ముందు మాట్లాడిన వాజెద్.. పాకిస్థాన్ ఐఎ్‌సఐ, మరికొన్ని విదేశీ నిఘా సంస్థల ప్రభావం బంగ్లాలో పెరిగిపోయిందని ఆరోపించారు. మరోవైపు, షేక్ హసీనా నిర్వహించిన విలేకరుల సమావేశంతో తమకు ఎలాంటి సంబంధం లేదని భారత్ ప్రకటించింది. అది ఓ ప్రైవేటు మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమమని స్పష్టం చేసింది. హసీనా భారత్ భూభాగం నుంచి రాజకీయ కార్యకలపాలు కొనసాగిస్తుండడం వల్ల ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బ తినే అవకాశముందన్న బంగ్లాదేశ్ ఆందోళన నేపథ్యంలో ఈ మేరకు స్పష్టతనిచ్చింది.
ఇవీ చదవండి:
ఎన్‌డీఏ సమావేశానికి ముగ్గురు రెబల్ ఎంపీల గైర్హాజరు.. సువేందు విందుకు హాజరు
'మూడు రోజుల్లో క్షమాపణ చెప్పాలి'.. మెటాకు పార్లమెంట్ అల్టిమేటం