Share News

విడుదలవ్వని 500 సినిమాల వివరాలు అంగట్లోకి..

ABN , Publish Date - Oct 26 , 2026 | 05:58 AM

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (సీబీఎఫ్‌సీ)లో భారీ డేటా లీక్‌ జరిగింది

విడుదలవ్వని 500 సినిమాల  వివరాలు అంగట్లోకి..
cinema

  • సెన్సార్‌ బోర్డు వెబ్‌సైట్‌ నుంచి డేటా లీక్‌

  • విడుదల కాని సినిమాల స్క్రిప్టులు

  • ఒప్పందాల వివరాలు బహిర్గతం

  • ఇంటర్నెట్‌ ఆర్కైవ్స్‌ డిజిటల్‌ లైబ్రరీలో

  • అందుబాటులో ఉంచిన సైబర్‌ నేరగాళ్లు

  • నష్టం ఏమీ జరగలేదు: సీబీఎఫ్‌సీ

  • సెన్సార్‌ బోర్డు వెబ్‌సైట్‌లో సినిమాల డేటా లీక్‌

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (సీబీఎఫ్‌సీ)లో భారీ డేటా లీక్‌ జరిగింది. ఆ సంస్థకు చెందిన ఈ-సినీ ప్రమాణ్‌ వెబ్‌సైట్‌ నుంచి దాదాపు 500 కొత్త సినిమాలకు చెందిన సున్నిత సమాచారాన్ని తస్కరించి లాభాపేక్ష లేని డిజిటల్‌ లైబ్రరీ అయిన ఇంటర్నెట్‌ ఆర్కైవ్స్‌లో ఉంచారని జాతీయ మీడియా ఆదివారం వెల్లడించింది. వీటిలో సినిమాలను థియేటర్లలో విడుదల చేసే అనుమతి పత్రాల కోసం నిర్మాతలు సమర్పించిన షూటింగ్‌ స్ర్కిప్టులు, కట్‌ ఆర్డర్స్‌, డిస్ట్రిబ్యూటర్లతో చేసుకున్న ఒప్పందాల వివరాలకు సంబంధించిన ఫైళ్లు ఉన్నాయని తెలిపింది. సినిమాలకు సెన్సార్‌ అనుమతి కోసం నిర్మాతలు ఈ-సినీప్రమాణ్‌ పోర్టల్‌ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. సర్టిఫికేషన్‌కు అవసరమైన అన్ని పత్రాలను అందులోనే అప్‌లోడ్‌ చేస్తారు. వీటిలో సినిమాకు మూలమైన స్ర్కిప్టులు కూడా ఉంటాయి. తాజాగా లీకైన వివరాల్లో విదేశాలకు చెందిన ‘ది సీక్రెట్‌ ఏజెంట్‌’, ‘గుడ్‌లక్‌ హ్యావ్‌ఫన్‌ డోన్ట్‌ డై’ తదితర సినిమాల విడుదల కోసం మనదేశంలోని డిస్ట్రిబ్యూటర్లతో చేసుకున్న ఒప్పంద పత్రాలు కూడా ఉండటం గమనార్హం.


ఈ వివరాలన్నీ బహిర్గతం కావటంతో నిర్మాతలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. అయితే, లీకైన వివరాలను ఎవరూ తస్కరించినట్లు ఆధారాలు లేవని సీబీఎఫ్‌సీ తెలిపింది. ఈ-సినీప్రమాణ్‌ వెబ్‌సైట్‌ భద్రతపై సమీక్ష నిర్వహిస్తున్నామని, డేటా లీక్‌పై సైబర్‌ భద్రత విభాగానికి ఫిర్యాదు చేశామని పేర్కొంది.

న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి)

ఈ వార్తలు కూడా చదవండి..

అమెరికా మళ్లీ దాడి చేసినా మా విధానాలు మారవు: ఇరాన్ విదేశాంగ మంత్రి

వసుధైక కుటుంబం మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తున్నాం: జైశంకర్

Updated Date - Oct 26 , 2026 | 06:59 AM