డిప్యూటీ ఈసీ పర్యవేక్షణలోనే సీమా ఖన్నా
ABN , Publish Date - Nov 06 , 2026 | 06:03 AM
కేంద్ర ఎన్నికల సంఘంలో ఐటీ విభాగం డైరెక్టర్ జనరల్(డీజీ) సీమా ఖన్నా రిపోర్టింగ్ విధానంలో ఎలాంటి మార్పూ లేదని ఈసీ అధికారి ఒకరు స్పష్టం చేశారు.
ఐటీ విభాగం డీజీ విధుల్లో ఎలాంటి మార్పూ లేదు
కొత్త పని విభజన ఉత్తర్వుపై ఈసీ అధికారి స్పష్టీకరణ
న్యూఢిల్లీ, నవంబరు 5: కేంద్ర ఎన్నికల సంఘంలో ఐటీ విభాగం డైరెక్టర్ జనరల్(డీజీ) సీమా ఖన్నా రిపోర్టింగ్ విధానంలో ఎలాంటి మార్పూ లేదని ఈసీ అధికారి ఒకరు స్పష్టం చేశారు. బుధవారం వెలువడిన కొత్త పని విభజన ఉత్తర్వు ప్రకారం.. ఆమె ఇకపై కొత్త డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ప్రకాశ్ రాజ్‌పురోహిత్ పర్యవేక్షణలో పనిచేస్తారు. ఇప్పటివరకు ఈ బాధ్యతను సీనియర్ డిప్యూటీ ఈసీ మనీశ్ గార్గ్ చూశారు. ఐటీ బాధ్యతలను డిప్యూటీ ఈసీ సంజయ్ కుమార్ నుంచి తప్పిస్తూ గార్గ్ జూలై 28న ఉత్తర్వు ఇచ్చారు. దీంతో ఖన్నా నేరుగా కమిషన్‌కే రిపోర్ట్ చేయాల్సి వచ్చేది. కమిషన్ ఆమోదం లేకుండా ఈ ఉత్తర్వు ఇచ్చారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి మరుసటి రోజే క్యాబినెట్ కార్యదర్శికి లేఖ రాశారు. జూలై 30న ఇద్దరూ క లిసి ఆ ఉత్తర్వును పక్కనపెట్టారు. అందువల్ల జూలై 28 ఉత్తర్వు అమలే కాలేదని ఈసీ అక్టోబరు 26న సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆగస్టులో సంజ య్ కుమార్ ఎన్నికల సంఘాన్ని వీడిన తర్వాత గార్గ్ పర్యవేక్షణలో ఖన్నా పనిచేశారని, ఇప్పుడు ఆ బాధ్యత ప్రకాశ్‌రాజ్ పురోహిత్‌కు వచ్చిందని ఆ అధికారి వివరించారు. ఖన్నా ఎప్పుడూ డిప్యూటీ ఈసీ స్థాయి అధికారికే రిపోర్ట్ చేస్తూ వచ్చారని, కొత్త ఉత్తర్వు కమిషన్ ఏకగ్రీవ నిర్ణయమని గురువారం ఈసీ వర్గాలు పేర్కొన్నాయి. సర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా డిజిటల్ వ్యవస్థ కేంద్రీకరణ, ఎన్నికల సాఫ్ట్‌వేర్‌లో ఆంక్షల ఆరోపణల వివాదంలో ఖన్నా పేరు ప్రముఖంగా వినిపించిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
రాహుల్ మద్యం వ్యాఖ్యలు.. ‘పప్పు’ అంటూ ఆప్ కౌంటర్
బ్లింకిట్ అంబులెన్స్ సేవల్లో మార్పులు.. ఇకపై నాన్ ఎమర్జెన్సీ బుకింగ్‌కు రూ.2,500