రాహుల్ మద్యం వ్యాఖ్యలు.. ‘పప్పు’ అంటూ ఆప్ కౌంటర్
ABN , Publish Date - Nov 05 , 2026 | 05:35 PM
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య రాజకీయ పోరు రసవత్తరంగా మారింది. ఎన్నికలకు కొన్ని నెలల సమయం ఉండగానే ఆ రెండు పార్టీల నేతల వ్యక్తిగత విమర్శలు తారస్థాయికి చేరాయి.
చండీగఢ్, నవంబర్ 5: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య రాజకీయ పోరు రసవత్తరంగా మారింది. ఎన్నికలకు కొన్ని నెలల సమయం ఉండగానే ఆ రెండు పార్టీల నేతల వ్యక్తిగత విమర్శలు తారస్థాయికి చేరాయి. ముఖ్యంగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన మద్యం వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపగా.. ఆప్ సైతం రాహుల్‌ను ‘పప్పు’ అని ఎద్దేవా చేస్తూ ఎదురుదాడికి దిగింది.
రాహుల్ మద్యం వ్యాఖ్యలు..
పంజాబ్‌లోని సంగ్రూర్‌లో ఈ నెల 4న నిర్వహించిన ‘ఇన్సాఫ్ ర్యాలీ’లో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గతంలో మాన్ ఎంపీగా ఉన్నప్పుడు లోక్‌సభలో తనతో కలిసి కూర్చునేవారని ఆయన తెలిపారు. అయితే, ఉదయం 11 గంటలకే మాన్ నుంచి మద్యం వాసన వచ్చేదని రాహుల్ ఆరోపించారు. మద్యం సేవించడం ఆయన వ్యక్తిగత విషయమని చెబుతూనే.. రాష్ట్రంలో డ్రగ్స్ సమస్యను అరికట్టాల్సిన ముఖ్యమంత్రి ప్రతిరోజూ మత్తులో ఉంటే ఆ సమస్యను ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. పంజాబ్‌లో డ్రగ్స్ సమస్యను పూర్తిగా నిర్మూలిస్తామని ఆప్ హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే, రాష్ట్రంలో ఏ ప్రాంతంలో డ్రగ్స్ సమస్య పూర్తిగా తగ్గిందో చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, పంజాబ్ ప్రభుత్వాన్ని ఢిల్లీ నుంచి అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నియంత్రిస్తున్నారంటూ విమర్శించారు. రాష్ట్ర పాలనపై పంజాబ్ నాయకులకే పూర్తి అధికారం ఉండాలని వ్యాఖ్యానించారు.
‘పప్పు’ అంటూ ఆప్ ఎదురుదాడి..
రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ఆప్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఆయన్ని ఉద్దేశించి ‘పప్పు’ అనే పేరుతో ఎద్దేవా చేసింది. ఈ మేరకు 2017లో గుజరాత్లో రాహుల్ ప్రసంగానికి సంబంధించిన వ్యాఖ్యను జత చేసింది. అందులో బంగాళాదుంపలు వేస్తే బంగారం వస్తుందని రాహుల్ చెబుతున్నట్లుగా ఉంది. అలాగే ఆయన గతంలో చేసిన వ్యాఖ్యల్లో తమకు నచ్చిన జోక్ ఏదో చెప్పాలంటూ నెటిజన్లను ఆప్ కోరింది. మరోవైపు, కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలను ఆప్ ఢిల్లీ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ తప్పుబట్టారు. జాతీయ స్థాయి నాయకుడు ఇలాంటి వ్యక్తిగత విమర్శలకు దిగడం తగదని అన్నారు. కాంగ్రెస్‌కు ప్రధాన రాజకీయ ప్రత్యర్థి బీజేపీనా? లేక ప్రతిపక్ష పార్టీలేనా? అని ప్రశ్నించారు.
కాగా, పంజాబ్ అసెంబ్లీ ప్రస్తుత పదవీకాలం 2027 మార్చి 16తో ముగియనుంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన ఆప్.. మరోసారి తన పట్టును నిలుపుకోవాలని చూస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు, బీజేపీ కూడా పంజాబ్‌లో తన రాజకీయ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. దీంతో ఆయా పార్టీల నేతల మాటల యుద్ధంతో రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
ఈ వార్తలు కూడా చదవండి
మిమ్మల్ని కలిసేందుకు అపాయింట్మెంట్ ఎందుకు? ఐఏఎస్‌పై వ్యక్తి ఫైర్
మహిళ కిడ్నాప్ డ్రామా.. వెలుగులోకి బంగారం స్మగ్లింగ్ వ్యవహారం..