Share News

రాహుల్ గాంధీ ఒక చైనా రోబో: బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర

ABN , Publish Date - Aug 25 , 2026 | 02:52 PM

చైనా ఆర్మీ రోబోలతో భారత్ తలపడాల్సి రావొచ్చన్న కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ వ్యాఖ్యలపై బీజేపీ ప్రతినిధి, ఎంపీ సంబిత్ పాత్ర స్పందించారు. రాహుల్ గాంధీయే ఒక చైనా రోబో అని విమర్శించారు.

రాహుల్ గాంధీ ఒక చైనా రోబో: బీజేపీ  ఎంపీ సంబిత్ పాత్ర
MPs Sambit Patra, Manish Tiwari

ఇంటర్నెట్ డెస్క్: చైనా రోబోలతో భారత్ తలపడాల్సి రావొచ్చన్న కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ వ్యాఖ్యలపై బీజేపీ ప్రతినిధి, ఎంపీ సంబిత్ పాత్ర స్పందించారు. రాహుల్ గాంధీయే ఒక చైనా రోబో అని విమర్శించారు. కాంగ్రెస్‌ది చైనా మైండ్‌సెట్ అని ఎద్దేవా చేశారు. ఒలింపిక్ విజేత ఉసేన్ బోల్ట్ రికార్డును తమ రోబో అధిగమించిందని ఇటీవల ఓ చైనా కంపెనీ ప్రకటించిన నేపథ్యంలో ఎంపీ మనిష్ తివారీ చేసిన పోస్టుపై ఎంపీ సంబిత్ పాత్ర ఈ మేరకు స్పందించారు.

చైనా రోబోల పరుగు గురించి న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చిన కథనాన్ని షేర్ చేస్తూ ఎంపీ మనీష్ తివారీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘భారత్ జాగ్రత్తగా ఉండకపోతే వాస్తవాధీన రేఖ వద్ద మనం చైనా ఆర్మీకి చెందిన రోబోలతో తలపడాల్సి ఉంటుంది. చైనా అద్భుత రీతిలో మనుషులను పోలిన రోబోలను తయారు చేస్తోంది. కాబట్టి ప్రగతిపథంలో దూసుకుపోతున్నామంటూ జబ్బలు చరుచుకునే మనం వాస్తవంగా ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎంత వెనకబడ్డామో తెలుసుకోవాలి. 67 కీలక సాంకేతికతల్లో చైనా ఇప్పటికే అమెరికాను అధిగమించింది’ అని మనీష్ తివారీ అన్నారు.


ఈ పోస్టుపై సంబిత్ పాత్ర ఘాటుగా స్పందించారు. ‘ముందు మనం వాస్తవాధీన రేఖ వద్ద కాంగ్రెస్ మైండ్‌సెట్‌తో పోరాడాలి. ఢోక్లామ్ ఉద్రిక్తతల సందర్భంగా చైనా పంచన ముందు కనిపించింది వారే! చైనా వాళ్లు మన ఆర్మీని కొట్టారని రాహుల్ గాంధీ అప్పట్లో అన్నారు. అసలు రాహుల్ గాంధీనే చైనా రోబో. ముందు మనం ఆయన మైండ్‌సెట్‌పై పోరాడాలి’ అని విమర్శించారు.

ఇక ఉసేన్ బోల్ట్ రికార్డును బద్దలు కొట్టిన హ్యుమనాయిడ్ రోబోను చైనాకు చెందిన యూనీట్రీ కంపెనీ రూపొందించింది. తమ రోబో ఒక సూపర్‌మ్యాన్ అని చెప్పుకుంది. గంటకు 45.6 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని అందుకోగలదని పేర్కొంది. అంతేకాకుండా, ఈ రోబో నిలబడ్డ చోటునుంచే రెండు మీటర్ల ఎత్తు వరకూ ఎగరగలదని పేర్కొంది. తమ రోబో ఘనత గురించి యూనీట్రీ ఘనంగా ప్రకటించుకున్నప్పటికీ దాని సామర్థ్యాలను స్వతంత్ర ప్రతిపత్తి గలిగిన సంస్థలు ఇంకా సమీక్షించాల్సి ఉంది.


ఈ వార్తలనూ చదవండి:

జర్నలిస్ట్‌ అభిషేక్‌ ఉపాధ్యాయ్‌కు సుప్రీంకోర్టులో ఊరట

కొత్త తరానికి బాధ్యతలు అప్పగించాల్సిన సమయం వచ్చింది: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ..

Updated Date - Aug 25 , 2026 | 04:48 PM