బిహార్‌లో దారుణం.. మరో బాలికపై లైంగిక వేధింపులు..
ABN , Publish Date - Sep 24 , 2026 | 11:53 AM
బిహార్‌లో బాలికలపై వరుసగా లైంగిక వేధింపులు కలకలం రేపుతున్నాయి. జముయి ఘటన మరువక ముందే అలాంటిదే మరొకటి జరగడం సంచలనం రేపుతోంది. తాజాగా ఓ అల్లరి మూక రోడ్డుపై ఫొటోలు తీసుకుంటున్న బాలిక, బాలుడిపై దాడి చేసి లైంగికంగా వేధించారు.
పాట్నా: బిహార్‌లో బాలికలపై వరుసగా లైంగిక వేధింపులు కలకలం రేపుతున్నాయి. జముయి ఘటన మరువక ముందే అలాంటిదే మరొకటి జరగడం సంచలనం రేపుతోంది. తాజాగా ఓ అల్లరి మూక రోడ్డుపై ఫొటోలు తీసుకుంటున్న బాలిక, బాలుడిపై దాడి చేశారు. బాలికను లైంగికంగా వేధించి చిత్రహింసలకు గురి చేశారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న బిహార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన సమస్తిపూర్ జిల్లా జగత్‌సింగ్‌పూర్‌లో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
బుధవారం నాడు సమస్తిపూర్ జిల్లా జగత్‌సింగ్‌పూర్ రహదారిపై ఓ బాలిక, బాలుడు ప్రయాణిస్తున్నారు. వారిద్దరూ గ్రామానికి కొంత దూరంలో ఆగి ఫొటోలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో ద్విచక్రవాహనాలపై అటుగా వచ్చిన కొంత మంది యువకులు వారిని చూసి ఆగారు. మైనర్లను చుట్టుముట్టి తీవ్రంగా వేధించారు. బాలికను తొలుత తీవ్రంగా దూషించారు. ఆ తర్వాత వారిద్దరిపై దాడికి తెగబడ్డారు. ఆమెను విపరీతంగా కొట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లి లైంగికంగా వేధించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు కావడంతో వైరల్‌గా మారింది. దీనిపై పోలీసులు వెంటనే స్పందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మరోవైపు, వీడియోలో కనిపించిన నిందితులు జగత్‌సింగ్‌పూర్ గ్రామానికి చెందినవారని స్థానికులు తెలిపారు. అయితే, ఆ వ్యక్తుల ఆచూకీ ఇంకా లభించలేదని పోలీసులు చెప్పారు. తాము ఈ విషయాన్ని చాలా తీవ్రంగా తీసుకున్నామని, ఎవరినీ వదిలిపెట్టబోమని పోలీస్ అధికారి అరవింద్ ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు.
కాగా, ఇటీవల బిహార్‌లోని జముయి ప్రాంతంలో ఇలాంటి ఘటనే జరిగింది. 10వ తరగతి చదువుతున్న ఓ బాలుడు, బాలికపై అల్లరి మూక దాడి చేసింది. బాలుడిని తీవ్రంగా కొట్టగా.. బాలికను లైంగికంగా వేధించింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు, బిహార్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. ఈ క్రమంలో కాల్పులు జరపగా.. ప్రధాన నిందితుడి కాలికి బుల్లెట్ గాయాలయ్యాయి. కాగా, తాజా ఘటనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.
ఈ వార్తలు కూడా చదవండి
ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య కేసు.. వెలుగులోకి సీసీటీవీ దృశ్యాలు..
కొడుకు అరెస్టుతో తండ్రి నేర చరిత్ర వెలుగులోకి.!