ఆగని సంక్షోభం..టీఎంసీ రెబల్స్ గూటికి మరో ఇద్దరు లోక్‌సభ ఎంపీలు
ABN , Publish Date - Jun 10 , 2026 | 04:51 PM
తృణమూల్ కాంగ్రెస్‌లో తలెత్తిన సంక్షోభం మరింత ముదురుతోంది. జాదవ్‌పూర్ లోక్‌సభ ఎంపీ సాయోని ఘోష్, కోల్‌కతా దక్షిణ్ ఎంపీ మాలా రాయ్‌లు కకోలి ఘోష్ దస్తిదార్ సారథ్యంలోని తిరుగుబాటు ఎంపీల గ్రూపులో చేరనున్నట్టు తెలుస్తోంది.
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో తలెత్తిన సంక్షోభం మరింత ముదురుతోంది. జాదవ్‌పూర్ లోక్‌సభ ఎంపీ సాయోని ఘోష్, కోల్‌కతా దక్షిణ్ ఎంపీ మాలా రాయ్‌లు కకోలి ఘోష్ దస్తిదార్ సారథ్యంలోని తిరుగుబాటు ఎంపీల గ్రూపులో చేరనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కకోలి ఘోష్‌తో సాయోని ఘోష్ సంప్రంపులు జరిపారని, చీలక వర్గానికి తన మద్దతు ప్రకటించడంతో పాటు ఆ వర్గానికి మద్దతిస్తున్నట్టు డాక్యుమెంట్లపై సంతకాలు చేశారని సమాచారం.
సాయోని ఘోష్ అసంతృప్తి
పార్టీ అధినాయకత్వంపై సాయోని ఘోష్ కొద్ది కాలంగా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల ప్రచార సమయంలో తనపై దాడి జరిగినప్పుడు పార్టీ నాయకత్వం నుంచి తనకు ఎలాంటి సపోర్ట్ రాలేదని, నాయకులు కూడా పట్టించుకోలేదని, దాంతో తాను ఒంటరినయ్యాననే అభిప్రాయం కలిగిందని ఆమె చెబుతున్నారు. ప్రచారం మధ్యలో ముగించుకుని వెనక్కి రావాలని నాయకత్వం ఆదేశించడం కూడా ఆమె అసంతృప్తికి ఒక కారణంగా తెలుస్తోంది.
మాలారాయ్ సైతం..
కోల్‌కతా దక్షిణ్ ఎంపీ మాలారాయ్ టీఎంసీ సీనియర్ నేత మాత్రమే కాకుండా, సిటీలో కీలక నేతగా గుర్తింపు పొందారు. పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా కూడా ఇటీవల ఆమె నియమితులయ్యారు. అయితే తాజాగా ఆమె ఎన్డీయే కూటమికి సహకరించే రెబల్ గ్రూప్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, ప్రస్తుతం మాలారాయ్, సాయోని ఘోష్ ఢిల్లీకి బయలుదేరినందున రెబల్ క్యాంప్‌లో చేరే అవకాశం ఉందని, వీరిద్దరితో కలిసి టీఎంసీ రెబల్ గ్రూపులో లోక్‌సభ ఎంపీల సంఖ్య 22కు చేరుతుందని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
మమతకు షాక్.. టీఎంసీకి మరో ఎంపీ రాజీనామా..
ఖర్గే సారథ్యంలో ఏఐసీసీ అత్యవసర సమావేశం 11న