గ్లోబల్ సమ్మిట్‌కు రండి
ABN , Publish Date - Sep 03 , 2026 | 05:49 AM
భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబరు 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’కు హాజరుకావాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను...
రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం ఆహ్వానం
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో
రక్షణ ఎక్స్‌పో-2026ను ప్రారంభించాలని విజ్ఞప్తి
దేవరకద్ర డీఆర్‌డీఎల్ ప్రాజెక్టుకు ఉచితంగా భూమి
మామునూరు ఎయిర్‌పోర్టుకు 2 వారాల్లో టెండర్లు..
డిసెంబరులో శంకుస్థాపన
రేవంత్‌కు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హామీ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబరు 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’కు హాజరుకావాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. ఆ సదస్సులో భాగంగా నిర్వహించే ‘రక్షణ ఎక్స్‌పో 2026’ను ప్రారంభించాలని, దాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడులతో వేర్వేరుగా భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. దేశవ్యాప్తంగా ఉన్న రక్షణ రంగ పరిశ్రమలు, స్టార్ట్‌పలు, యువ శాస్త్రవేత్తలు పాల్గొనే రక్షణ ఎక్స్‌పోకు హాజరై మార్గనిర్దేశం చేస్తే, వారికి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌తో భేటీలో పేర్కొన్నారు. రక్షణ ఎక్స్‌పోలో ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాలకు సంబంధించిన ప్రత్యేక సదస్సుతో పాటు.. ఎయిర్‌షో, పారిశ్రామిక ప్రదర్శన, భూరక్షణ వ్యవస్థలకు సంబంధించిన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వీటిలో.. ఎయిర్‌షో నిర్వహణకు అవసరమైన గగనతల అనుమతులు ఇవ్వడంతో పాటు భారత వైమానిక దళానికి చెందిన విమానాలు, సూర్యకిరణ్, సారంగ్ ఏరోబాటిక్ బృందాలు ప్రదర్శనలో పాల్గొనేలా సహకరించాలని రాజ్‌నాథ్‌కు సీఎం విజ్ఞప్తి చేశారు. స్టాటిక్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రదర్శనకు సహకరించాలని.. త్రివిధ దళాలకు చెందిన అత్యాధునిక రక్షణ వ్యవస్థలను ప్రదర్శనలో ఏర్పాటు చేయాలని, త్రివిధ దళాల ఉన్నతాధికారులు, ప్రతినిధులు భాగస్వాములయ్యేలా చూడాలని కోరారు. హెచ్‌ఏఎల్, బీఈఎల్, బీడీఎల్, ఎండీఎల్ తదితర ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలు, డీఆర్‌డీవో ప్రయోగశాలలు ఈ ఎక్స్‌పోలో పాల్గొని స్వదేశీ రక్షణ సాంకేతికతను ప్రదర్శించాలని అభ్యర్థించారు. అంతర్జాతీయ రక్షణ సంస్థల ప్రముఖులతో సమావేశాలు నిర్వహించేందుకు కేంద్ర రక్షణ శాఖ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
విమానాశ్రయానికి మరో 750 ఎకరాలు..
ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 750 ఎకరాల భూసేకరణ చేపట్టిందని రాజ్‌నాథ్‌కు సీఎం తెలిపారు. రక్షణ శాఖ మొత్తం 1500 ఎకరాలు కోరినందున, మరో 750 ఎకరాలు సేకరించి ఇస్తామన్నారు. అలాగే.. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో డీఆర్‌డీఎల్ ఆధ్వర్యంలో చేపట్టనున్న ప్రాజెక్టుకు 416.18 ఎకరాల భూమిని కేటాయించేందుకు ఇప్పటికే టీజీఐఐసీ అంగీకరించిందని తెలిపారు. ఎకరానికి కాకుండా మొత్తం భూమికి సంవత్సరానికి కేవలం రూ.1 నామమాత్రపు లీజు అద్దెతో 33 సంవత్సరాల కాలానికి భూమిని కేటాయించనున్నట్లు తెలిపారు. అవసరమైతే మరో రెండుసార్లు లీజు పొడిగించుకునే అవకాశం ఉందని తెలిపారు.
రెండు వారాల్లో మామునూరు టెండర్లు..
పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసిన సీఎం.. తెలంగాణలో ఆదిలాబాద్, మామునూరు (వరంగల్) విమానాశ్రయ పనులను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. మామునూరు ఎయిర్‌పోర్టుకు అవసరమైన భూమిని సేకరించి ఇచ్చామని తెలిపారు. ఆదిలాబాద్ విమానాశ్రయంలో కార్గో, ప్యాసింజర్ టెర్మినల్, ఎంఆర్‌వో (మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్‌హాలింగ్) వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. ఆదిలాబాద్‌లో రన్ వే ఖరారుకు రక్షణ, పౌర విమానయన శాఖల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో చాపర్ల ద్వారా హెలీ టూరిజం అభివృద్ధికి కృషి చేయాలని అభ్యర్థించారు. కాగా.. మామునూరు విమానాశ్రయం టెండర్లను రెండు వారాల్లో పూర్తిచేసి, డిసెంబరులో శంకుస్థాపన చేస్తామని రామ్మోహన్‌నాయుడు వెల్లడించారు. ఇక.. హుస్సేన్ సాగర్‌లో సీ ప్లేన్ ల్యాండింగ్‌కు సంబంధించిన నివేదికను రెండు వారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని పౌర విమానయాన శాఖ అధికారులు తెలియజేశారు.
జన హృదయ నేత వైఎస్..
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో తనదైన ముద్ర వేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహా నేత వై.ఎ్‌స.రాజశేఖర్ రెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. వైఎస్ వర్ధంతి సందర్భంగా.. ఢిల్లీలోని తన నివాసంలో సీఎం.. వైఎస్ చిత్రపటానికి నివాళులర్పించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి
వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..