సోనియా, ఒవైసీ కుటుంబాలకు రేవంత్ బానిస
ABN , Publish Date - Oct 02 , 2026 | 04:25 AM
ఢిల్లీలో సోనియా గాంధీ కుటుంబానికి, హైదరాబాద్‌లో మజ్లిస్ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి బానిస అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.
రాహుల్ మెప్పు కోసం సనాతన ధర్మంపై దాడి
ఇతర మతాల దేవుళ్ల గురించి మాట్లాడే ధైర్యం
రేవంత్‌కు ఉందా?: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో సోనియా గాంధీ కుటుంబానికి, హైదరాబాద్‌లో మజ్లిస్ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి బానిస అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన రేవంత్ తెలంగాణ అభివృద్ధి, సమాజం కోసం ప్రాణత్యాగం చేస్తానని చెప్పకుండా.. సోనియా కుటుంబం కోసం ప్రాణత్యాగం చేస్తాననడం సిగ్గుచేటని విమర్శించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మెప్పు కోసం సనాతన ధర్మం, రాజ్యాంగ సంస్థలపై రేవంత్ దాడి చేస్తున్నారని ఆరోపించారు. హిందూ దేవుళ్ల గురించి మాట్లాడుతూ హిందువులను అవహేళన చేస్తున్న ఆయనకు ఇతర మతస్థుల దేవుళ్లగురించి మాట్లాడే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. గురువారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. రేవంత్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీలు, 420 సబ్ గ్యారెంటీలను అమలు చేయకుండా రోజుకో కొత్త డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. కులాల పేరుతో చిచ్చు పెట్టడం, మతాలు, భాషల పేరుతో రెచ్చగొట్టం, ఉత్తరం, దక్షిణం మధ్య విభేదాలు సృష్టించడం స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రె్‌సకు అలవాటేనన్నారు. రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ ఎంతకైనా దిగజారుతుందని, రేవంత్ కూడా అదే పాలసీ అవలంబిస్తున్నారని విమర్శించారు.
ప్రధాని మోదీ ప్రజల హృదయాలను మాత్రమే చోరీ చేస్తారని, ఓటు చోరీకి పాల్పడబోరన్నారు. సర్ ప్రక్రియ గురించి మాట్లాడుతూ తెలంగాణలో ఒక్కొక్కరికి రెండు, మూడు స్థానాల్లో ఓట్లు ఉన్నాయని, వారు ఒకేచోట ఓటేసేలా చేస్తే కూడా ఇబ్బంది అనిపిస్తోందా? అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. సింగరేణి బొగ్గుకు అనుగుణంగా యాదాద్రి పవర్ ప్లాంట్ ఎందుకు నిర్మించలేదో? ఎవరి కోసం ఇలా చేశారో కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని బీజేపీ గెలుచుకుంటుందన్నారు. కాగా, ఢిల్లీలోని యశ్వంత్ ప్యాలెస్ మార్కెట్‌లో చేపట్టిన ‘స్వచ్ఛతా హీ సేవా’లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన చీపురు పట్టి రోడ్లు ఊడ్చారు. పారిశుధ్య కార్మికులతో మాట్లాడి.. వారి సేవలను కొనియాడారు.
ఈ వార్తలు కూడా చదవండి
మహా' విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థుల మృతి
నాడు నానీ.. నేడు మచ్చార్.. ఇజ్రాయెలీలకు అండగా భారతీయులు