ఆస్తుల కేసులో రాహుల్‌కు సుప్రీంకోర్టులో ఊరట
ABN , Publish Date - Nov 26 , 2026 | 04:20 AM
ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టులో ఊరట లభించింది
సీబీఐ, ఈడీలకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు రద్దు
న్యూఢిల్లీ, నవంబరు 25: ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆయనపై వచ్చిన ఫిర్యాదులోని ఆరోపణలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని సీబీఐ, ఈడీలకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. అయితే కేసును పూర్తిగా ముగించలేదు. పిటిషన్ విచారణార్హమా కాదా అనే అంశంతో సహా మొత్తం వ్యవహారాన్ని మళ్లీ కొత్తగా విచారించాలని హైకోర్టుకే తిప్పి పంపింది. రాహుల్ గాంధీని ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌ను ఆదేశించింది. విచారణార్హతతో సహా అన్ని అంశాలపై రాహుల్ వాదన వినాలని స్పష్టం చేసింది. ఈ కేసు విచారణకు కొత్త బెంచ్ ఏర్పాటు చేసి బహిరంగ కోర్టులో విచారించాలని అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సూచించింది. రాహుల్ గాంధీ తన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపిస్తూ కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త విఘ్నేష్ శిశిర్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ ఏడాది మేలో ఫిర్యాదులోని ఆరోపణలను పరిశీలించాలని సీబీఐ, ఈడీలను ఆదేశించింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాహుల్ గాంధీ ఆగస్టులో సుప్రీం కోర్టును ఆశ్రయించారు.