Share News

విషాదం.. రీల్స్ చేయడానికి వెళ్లి.. నదిలో మునిగి..

ABN , Publish Date - Apr 03 , 2026 | 07:36 PM

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలో రాణిదిహా గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. సరదాగా రీల్స్ చేసేందుకు రాప్తి నదికి వెళ్లిన ఐదుగురు విద్యార్థులు నదిలో మునిగిపోయారు. వారిలో ఒక విద్యార్థి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే..

విషాదం.. రీల్స్ చేయడానికి వెళ్లి.. నదిలో మునిగి..
Rapti River Tragedy

గోరఖ్‌పూర్, ఏప్రిల్3: ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లా రాణిదిహా గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. సరదాగా రీల్స్ చేసేందుకు రాప్తి నదికి వెళ్లిన ఐదుగురు విద్యార్థులు నదిలో మునిగిపోయారు. వారిలో ఒక విద్యార్థి ఒడ్డుకు చేరుకోగా.. మిగిలిన నలుగురు నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఒకే గ్రామానికి చెందిన నలుగురు బాలురు ఇలా అకస్మాత్తుగా మరణించడంతో రాణిదిహా గ్రామం మొత్తం శోకసముద్రంలో మునిగిపోయింది.


రాణిదిహా గ్రామానికి చెందిన ఐదుగురు స్నేహితులు బుధవారం మధ్యాహ్నం రాప్తి నది సమీపంలో రీల్స్ చేసుకోవడానికి వెళ్లారు. అమన్ (15), వివేక్ నిషాద్(15) గగన్ పాశ్వాన్(15), అనికేత్ యాదవ్(13)లతో పాటు వారి స్నేహితుడు రాజకరణ్ తమ సైకిళ్ళపై విన్యాసాలు చేస్తూ, వీడియోలు తీస్తూ మీర్జాపూర్ పిపా వంతెన సమీపానికి చేరుకున్నారు. నదిలో స్నానం చేస్తూ రీల్స్ చేద్దామనుకున్నారు. ఆ ఉత్సాహంతో.. ఐదుగురు స్నేహితులు లోతైన నీటిలోకి దిగారు. అంతలోనే నీటి ఉధృతి పెరిగింది. రాజ్‌కరణ్ ధైర్యంగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. మిగిలిన నలుగురు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు, రెస్క్యూ టీమ్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గజ ఈతగాళ్ల సహాయంతో భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు.


శుక్రవారం నలుగురు మృతదేహాలు రాప్తి నదిలో తేలుతూ కనిపించాయి. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమ పిల్లల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. వారి ఆవేదన చూసి గ్రామస్థులు సైతం కంటనీరు పెట్టుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

గిరిజనులకు కాంగ్రెస్ చేసింది గుండు సున్నా: ఎమ్మెల్యే హరీశ్ రావు..

బీఆర్‌ఎస్ ఖాళీ.. బీజేపీకి చోటు లేదు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌ ధ్వజం

Updated Date - Apr 03 , 2026 | 07:39 PM