Share News

పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్.రంగస్వామి ప్రమాణస్వీకారం..

ABN , Publish Date - May 13 , 2026 | 02:56 PM

కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్.రంగస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ కె. కైలాసనాథన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. నమశ్శివాయం, మల్లాడి కృష్ణారావు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్.రంగస్వామి ప్రమాణస్వీకారం..

పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్.రంగస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ కె.కైలాసనాథన్ ఆయనతో ప్రమాణం చేయించారు. కేబినెట్ మంత్రులుగా నమశ్శివాయం, మల్లాడి కృష్ణారావు బాధ్యతలు చేపట్టారు. పుదుచ్చేరిలో ఐదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఎన్.రంగస్వామి రికార్డు నెలకొల్పారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సహా పలువురు సీనియర్ బీజేపీ నాయకులు, మిత్రపక్షాల నేతలు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాజరయ్యారు.


సింగపూర్‌లా చేస్తా: సీఎం రంగస్వామి

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం మీడియాతో రంగస్వామి మాట్లాడారు. ఎన్డీయే కూటమికి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిపై మరింతగా దృష్టి సారిస్తుందని, ప్రజా సంక్షేమం కోసం అవసరమైన అన్ని పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పుదుచ్చేరిని ప్రధాన అభివృద్ధి, పర్యాటక కేంద్రంగా మార్చనున్నట్లు ఆయన తెలిపారు. పుదుచ్చేరిని సింగపూర్‌లా అభివృద్ధి చేయబోతున్నట్లు సీఎం రంగస్వామి ప్రకటించారు.


ప్రధాని మోదీ ఎక్స్ పోస్టు..

పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి, మంత్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టు పెట్టారు. 'పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్.రంగస్వామికి అభినందనలు. అక్కడ అభివృద్ధి ప్రస్థానాన్ని బలోపేతం చేసిన అనుభవజ్ఞుడైన, సమర్థవంతమైన పరిపాలకుడిగా ఆయన తనదైన ముద్ర వేశారు. కొత్త మంత్రులు పురోగతికి దోహదపడతారని, అక్కడి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను' అని మోదీ పోస్టు చేశారు.


30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీకి ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మెజారిటీ సీట్లు గెలుచుకుంది. ఈ కూటమిలో సీఎం రంగస్వామికి చెందిన ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ 12 స్థానాలు గెలుచుకోగా, బీజేపీ 4 స్థానాలను కైవసం చేసుకుంది. ఏఐఏడీఎంకే, ఎల్జేకే చెరో స్థానాన్ని దక్కించుకున్నాయి. మరోవైపు ప్రతిపక్షాలైన డీఎంకే 5 స్థానాలు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒక స్థానం గెలుచుకున్నాయి. ఇక, విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం రెండు స్థానాలతో ఖాతా తెరిచింది.


ఈ వార్తలు కూడా చదవండి

నీట్ ప్రశ్నాపత్రం లీక్.. స్పందించిన అరవింద్ కేజ్రీవాల్

జ్యోతిష్యుడి విషయంలో సీఎం విజయ్ యూటర్న్

Updated Date - May 13 , 2026 | 03:26 PM