Share News

గల్ఫ్‌ సంక్షోభం.. అధికారులతో మంత్రి రామ్మోహన్ నాయుడి సమీక్ష

ABN , Publish Date - Mar 10 , 2026 | 09:49 PM

గల్ఫ్‌లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించే చర్యలపై మంత్రి రామ్మోహన్ నాయుడు సమీక్ష నిర్వహించారు. గత పది రోజుల్లో సుమారు లక్ష మంది భారతీయులను విమానాల ద్వారా భారత్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.

గల్ఫ్‌ సంక్షోభం.. అధికారులతో మంత్రి రామ్మోహన్ నాయుడి సమీక్ష
Minister Rammohan Naidu review meeting

ఇంటర్నెట్ డెస్క్: గల్ఫ్‌లో సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పౌర విమానయాన శాఖ, డీజీసీఏ శాఖ అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. పశ్చిమాసియా దేశాల్లో చిక్కుకుపోయిన వారిని స్వదేశానికి తరలించేందుకు గత పది రోజులుగా చేపట్టిన చర్యల గురించి అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. వివిధ ప్రాంతాల్లోని స్థానిక రాయబార కార్యాలయ అధికారులు, విమానయాన సిబ్బంది సమన్వయంతో ప్రయాణికులను సురక్షితంగా స్వదేశానికి తరలిస్తున్నామని వివరించారు. గత నెల 28 నుంచి ఇప్పటివరకూ తీసుకున్న చర్యల గురించి వివరించారు. నేటి నుంచీ అమలు చేయబోతున్న ప్రణాళికనూ అధికారులు వివరించారు.

దోహా నుంచి ఢిల్లీ, ముంబై, కొచ్చిలకు ప్రతి రోజు సుమారు 850 మందిని తరలిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. సౌది అరేబియాలోని దమ్మామ్‌ విమానాశ్రయం నుంచి కొచ్చికి ప్రతి రోజూ సగటున 166 మందిని తరలించామని తెలిపారు. నేడు తెలుగు వారిని బహ్రెయిన్‌ నుంచి దమ్మామ్‌కు తరలించి, అక్కడి నుంచి గల్ఫ్‌ ఎయిర్‌ విమానంలో కొచ్చికి తీసుకువస్తున్నట్లు చెప్పారు. ఈనెల 16వ తేదీ వరకు గల్ఫ్‌ ఎయిర్‌ సంస్థ దోహా, దమ్మామ్ విమానాశ్రయాల నుంచి ఢిల్లీ, ముంబై, కొచ్చిలకు భారతీయులను తరలించేందుకు షెడ్యూల్‌ ఇచ్చినట్లు చెప్పారు.


గల్ఫ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి భారతీయులను ఈ రెండు విమానాశ్రయాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. విదేశాంగ శాఖ అధికారులతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ భారతీయులను సురక్షితంగా తరలించే ఏర్పాట్లు చేశామని అధికారులు మంత్రికి వివరించారు.

దేశీయ విమానయాన సంస్థలతో పాటు గల్ఫ్‌ ఎయిర్‌ ఈ విషయంలో పూర్తిగా సహకారం అందిస్తోందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. గత పది రోజుల్లో దేశీయ విమానయాన సంస్థలతో మంత్రి సమీక్ష అనంతరం ఆయా సంస్థలు వేగంగా చర్యలు తీసుకున్నాయని చెప్పారు. విమానయాన సంస్థలు అన్నీ కలిపి ఇప్పటివరకూ సుమారు లక్ష మంది భారతీయులను స్వదేశానికి తరలించినట్లు అధికారులు తెలిపారు. తరలింపు ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని ఈ సందర్భంగా అధికారులను మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. వీసా సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

గల్ఫ్‌ నుంచి వచ్చే విమానాలకు ఎయిర్‌ ట్రాఫిక్‌లో ఇబ్బందులు తలెత్తకుండా, ల్యాండింగ్‌ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీజీసీఏ అధికారులను కూడా మంత్రి ఆదేశించారు. అక్కడి ఉద్రిక్త పరిస్థితుల రీత్యా మంత్రి రామ్మోహన్‌ నాయుడు గత పది రోజులుగా అధికారులతో కలిసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన సూచనలు సలహాలు ఇస్తున్నారు.


ఈ వార్తలూ చదవండి:

ఐఈఏ అభ్యర్థనను తిరస్కరించిన భారత్!

ఎల్పీజీపై ఆందోళన వేళ.. కేంద్రం కీలక నిర్ణయం

Updated Date - Mar 10 , 2026 | 10:01 PM