చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ నటుడికి మూడు నెలల జైలు శిక్ష..
ABN , Publish Date - Jul 10 , 2026 | 03:30 PM
బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు చెక్ బౌన్స్ కేసులో ఢిల్లీ హైకోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. ట్రయల్ కోర్టు గతంలో విధించిన ఆరు నెలల జైలు శిక్షను హైకోర్టు మూడు నెలలకు తగ్గించింది. రాజ్‌పాల్ దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఇవాళ(శుక్రవారం) కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు.
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు చెక్ బౌన్స్ కేసులో ఢిల్లీ హైకోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. ట్రయల్ కోర్టు గతంలో విధించిన ఆరు నెలల జైలు శిక్షను హైకోర్టు మూడు నెలలకు తగ్గించింది. రాజ్‌పాల్ దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఇవాళ(శుక్రవారం) కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు. అయితే, హైకోర్టు తన తీర్పు అమలుపై రెండు నెలల పాటు స్టే విధించింది. ఈ గడువులోపు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు రాజ్‌పాల్ యాదవ్‌కు అవకాశం కల్పించింది. హైకోర్టు తీర్పుపై ఆయన ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా, లేదా? అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
విచారణ సందర్భంగా ప్రొబేషన్ ఆఫ్ ఆఫెండర్స్ చట్టం కింద శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలన్న రాజ్‌పాల్ యాదవ్ విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. కేసు విచారణ సమయంలో ఆయన ప్రవర్తన, కోర్టుకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం వంటి అంశాల దృష్ట్యా ఆ చట్టం కింద ఉపశమనం ఇచ్చేందుకు నిరాకరించింది. విచారణ సందర్భంగా రాజ్‌పాల్ పలుమార్లు బకాయి మొత్తాన్ని చెల్లిస్తానని కోర్టుకు హామీ ఇచ్చినప్పటికీ, అందుకు అనుగుణంగా వ్యవహరించలేదని హైకోర్టు పేర్కొంది. కోర్టు ఎన్నో అవకాశాలు ఇచ్చినా ఆయన తన హామీలను అమలు చేయలేదని వ్యాఖ్యానించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన విచారణలో రాజ్‌పాల్ యాదవ్ తరచూ తన వైఖరిని మార్చడంపై జస్టిస్ స్వర్ణ కాంత శర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 'న్యాయమూర్తి మీ పట్ల మంచిగా వ్యవహరిస్తున్నారని ఆయన బలహీనుడని అనుకోవద్దు' అని వ్యాఖ్యానించారు.
రాజ్‌పాల్ ఇప్పటికే జైలు శిక్ష అనుభవించినందున ఇక బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. అయితే, రాజ్‌పాల్ మాత్రం తాను బకాయిలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి 'మీరు చెల్లిస్తానంటున్నారు.. మీ న్యాయవాది మాత్రం చెల్లించాల్సిన అవసరం లేదంటున్నారు. చెల్లించాలనుకుంటే ఈ విచారణ ఎందుకు?' అని ప్రశ్నించారు. మిగిలిన రూ.6 కోట్ల బకాయిలు చెల్లించేందుకు మరో 30 రోజుల గడువు ఇవ్వాలని రాజ్‌పాల్ కోరినా కోర్టు నిరాకరించింది. ఇక గడువు ఇవ్వలేమంటూ స్పష్టం చేసింది. దీనిపై రాజ్‌పాల్ తనకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని, ఐదు ఫ్లాట్లు కూడా అమ్ముకోవాల్సి వచ్చిందన్నారు. అవసరమైతే మరో ఐదుసార్లు జైలుకు పంపండంటూ న్యాయస్థానం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
కేసు ఏంటి?
రాజ్‌పాల్ యాదవ్ 2010లో తన దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆటా పటా లాపటా' చిత్రం కోసం ఢిల్లీకి చెందిన మురళీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి రూ.5 కోట్ల రుణం తీసుకున్నారు. అయితే 2012లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో రాజ్‌పాల్‌కు తీవ్ర ఆర్థిక నష్టాలు ఎదురయ్యాయి. దీంతో తీసుకున్న బకాయి చెల్లింపులో జాప్యం ఏర్పడింది. ఆయన ఇచ్చిన చెక్కు కూడా బౌన్స్ కావడంతో ఆ సంస్థ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు అయ్యింది. 2018లో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు రాజ్‌పాల్ యాదవ్‌ను దోషిగా తేల్చి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 2019లో అప్పీలేట్ కోర్టు కూడా ఆ తీర్పును సమర్థించింది.
వడ్డీతో కలిపి బకాయి మొత్తం కాలక్రమేణా దాదాపు రూ.9 కోట్లకు చేరినట్లు కోర్టు రికార్డులు పేర్కొన్నాయి. అనంతరం కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయడంతో రాజ్‌పాల్‌కు మధ్యంతర బెయిల్ లభించింది. తాజా తీర్పులో హైకోర్టు నేర నిర్ధారణను యథాతథంగా కొనసాగిస్తూ జైలు శిక్షను మాత్రమే ఆరు నెలల నుంచి మూడు నెలలకు తగ్గించింది. అదే సమయంలో తీర్పు అమలును రెండు నెలల పాటు నిలిపివేసి, ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
ఈ వార్తలు కూడా చదవండి
సుప్రీంకోర్టులో ఊహించని ఘటన.. న్యాయమూర్తులపై ఆగ్రహించిన పిటిషనర్..
నాలుగు దశాబ్దాల తర్వాత సరికొత్త చరిత్ర.. న్యూజిలాండ్‌లో అడుగుపెట్టిన ప్రధాని మోదీ!