Share News

మద్యం మత్తులో తప్పు చేశా.. క్షమించు సామీ

ABN , Publish Date - Sep 11 , 2026 | 01:54 PM

రెండున్నరేళ్ల క్రితం ఆలయంలో చోరీ.. దేవుడి ఆభరణాలు మాయమయ్యాయి.. ఇక ఆ దొంగ దొరకడమే కష్టమనుకున్న సమయంలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఏకంగా దొంగే చోరీ చేసిన నగలను తిరిగి ఆలయంలో వదిలి వెళ్లాడు. వివరాల్లోకి వెళితే..

మద్యం మత్తులో తప్పు చేశా.. క్షమించు సామీ
Rajasthan Temple Theft

ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్‌లోని ఝలావార్‌ జిల్లా కరల్‌ గ్రామంలోని పురాతన నరసింహ ఆలయంలో ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఆలయ ప్రాంగణంలో భజన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం ఆలయాన్ని శుభ్రం చేస్తున్న పూజారి మోహన్‌లాల్‌ బైరాగీకి ఓ ఆకుపచ్చ పాలిథీన్‌ సంచి కనిపించింది. దాన్ని భక్తుడు వదిలి వెళ్లిన ప్రసాదంగా భావించి పక్కన పెట్టారు.

బుధవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో సాయంకాల పూజకు సిద్ధమవుతున్నప్పుడు పూజారి దృష్టి మళ్లీ ఆ సంచిపై పడింది. తెరిచి చూడగా రెండున్నరేళ్ల క్రితం ఆలయం నుంచి చోరీకి గురైన కిరీటం ముక్కలు, వెండి ఆభరణాలు కనిపించాయి. అవి కరిగించినట్లు ఉండటంతో పూజారి ఆశ్చర్యపోయారు. అదే సంచిలో రూ.2 వేల నగదుతో పాటు ఓ లేఖ కూడా ఉండటంతో అసలు విషయం బయటపడింది.


‘జై శ్రీరామ్‌’ అంటూ లేఖ.. దొంగలో పశ్చాత్తాపం..

‘జై శ్రీరామ్‌’ అంటూ ప్రారంభమైన ఆ లేఖలో దొంగ తాను మద్యం మత్తులో పెద్ద తప్పు చేశానని.. తనను క్షమించాలని గ్రామస్థులను కోరినట్లు సమాచారం. చోరీ చేసిన ఆభరణాలను బాగు చేయించేందుకు రూ.2 వేల నగదును కూడా పంపుతున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. ఈ విషయం గ్రామంలో తెలియడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆలయానికి చేరుకున్నారు. రెండున్నరేళ్ల క్రితం మాయమైన స్వామివారి ఆభరణాలు తిరిగి ఆలయానికి చేరడం.. అందులోనూ దొంగ స్వయంగా తన తప్పును అంగీకరించి క్షమాపణ కోరడంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. గ్రామస్థులు దీనిని అద్భుతంగా, దొంగలో వచ్చిన పశ్చాత్తాపానికి నిదర్శనంగా అభివర్ణిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రైళ్లన్నీ కిటకిట.. వరుస సెలవులతో సొంతూరు బాటపట్టిన జనం

మెగా డీఎస్సీపై జగన్ విషం కక్కడం బాధాకరం: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telangana New

Updated Date - Sep 11 , 2026 | 02:07 PM