రైల్వేస్టేషన్లలోని తాగునీటిలో ఈ-కోలి
ABN , Publish Date - Aug 17 , 2026 | 06:14 AM
దేశవ్యాప్తంగా వందలాది రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు కనీస సదుపాయాలు కూడా లేవని కాగ్ నివేదిక వెల్లడించింది. హైదరాబాద్, కోయంబత్తూరు సహా పలు స్టేషన్లలోని వాటర్...
జాబితాలో హైదరాబాద్, కోయంబత్తూరు, ముంబై స్టేషన్లు
458 స్టేషన్లలో సదుపాయాలు అధ్వానం: కాగ్ నివేదిక
న్యూఢిల్లీ, ఆగస్టు 16: దేశవ్యాప్తంగా వందలాది రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు కనీస సదుపాయాలు కూడా లేవని కాగ్ నివేదిక వెల్లడించింది. హైదరాబాద్, కోయంబత్తూరు సహా పలు స్టేషన్లలోని వాటర్ కూలర్లు, ప్లాట్‌ఫాంలపై కుళాయిల నుంచి సేకరించిన నీటి నమూనాల్లో ఈ-కోలి బ్యాక్టీరియా ఆనవాళ్లను గుర్తించినట్లు తెలిపింది. వాష్‌రూంలు అత్యంత అపరిశుభ్రంగా ఉన్నాయని పేర్కొంది. ప్రయాణికుల కోసం రైల్వే మంత్రిత్వ శాఖ రూపొందించిన అనేక నిబంధనలను పాటించడంలో జోన్‌లు విఫలమయ్యాయని ఇటీవల పార్లమెంట్‌కు సమర్పించిన నివేదికలో కాగ్ వివరించింది. అన్ని జోన్లలోని 512 నాన్-సబర్బన్ గ్రేడ్ స్టేషన్లలో పరిస్థితులను అధ్యయనం చేసినట్లు తెలిపింది. హైదరాబాద్‌తో పాటు కోయంబత్తూరు, పాలక్కాడ్, ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్, భివండీ రోడ్, కల్యాణ్, లోనావాలా, మధుపూర్ స్టేషన్లలో వాటర్ కూలర్ల నుంచి సేకరించిన మంచినీటి నమూనాల్లో ఈ-కోలి బయటపడింది. 2022-23లో ఎనిమిది జోన్లలోని 49 స్టేషన్లు, 2023-24లో తొమ్మిది జోన్లలోని 56 స్టేషన్ల ప్లాట్‌ఫాంల్లోని కుళాయిల నీటిలో ఈ-కోలితో సహా టోటల్ కోలిఫార్మ్స్ బ్యాక్టీరియా ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. ఎంపిక చేసిన 512 రైల్వేస్టేషన్లలో 458 (89 శాతానికి పైగా) స్టేషన్లలో సౌకర్యాలు నిర్దేశించిన ప్రమాణాల కంటే చాలా తక్కువగా ఉన్నాయని కాగ్ అందోళన వ్యక్తం చేసింది.
వార్తలు కూడా చదవండి...
జీఆర్ఎంబీ అజెండా నుంచి తెలంగాణ వ్యతిరేక అంశాలు తొలగించాలి: హరీశ్‌రావు
నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోంది: డీజీపీ ఆనంద్
నకిలీ ట్రేడింగ్ యాప్‌తో బురిడీ.. సీఏను మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు