Share News

విద్యార్థులను బెదిరిస్తారా.. మీకెంత ధైర్యం?

ABN , Publish Date - Jul 25 , 2026 | 06:25 AM

జంతరమంతర్‌ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన ఆందోళనలకు విద్యార్థులు, అధ్యాపకులు దూరంగా ఉండాలని, చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు...

విద్యార్థులను బెదిరిస్తారా.. మీకెంత ధైర్యం?

  • జేఎన్‌యూ, ఢిల్లీ వర్సిటీలపై రాహుల్‌ మండిపాటు

  • విద్యార్థులపై పెల్లెట్‌ గన్‌తో కాల్పులు జరిపారంటూ ఫైర్‌

  • ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులుకంటితుడుపు చర్య: కాంగ్రెస్‌

న్యూఢిల్లీ, జూలై 24: జంతరమంతర్‌ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన ఆందోళనలకు విద్యార్థులు, అధ్యాపకులు దూరంగా ఉండాలని, చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంటూ డీయూ, జేఎన్‌యూ ప్రకటించడంపైనా కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించి, విద్యా వ్యవస్థపై అర్థవంతమైన చర్చను చేపట్టాల్సింది పోయి.. విద్యాసంస్థల ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వ్యవహరిస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే విమర్శించారు. ‘‘ప్రజాస్వామ్య హక్కుల కోసం నిలబడుతున్న విద్యార్థులను బెదిరించడానికి మీకెంత ధైర్యం? భవిష్యత్తులో సమయం వచ్చినప్పుడు మీరు దీనికి జవాబుదారీగా నిలవాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి’’ అని రాహుల్‌ గాంధీ హెచ్చరించారు. ప్రశ్నపత్రాల లీకేజీలపై ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ఏర్పాటు కేవలం కంటితుడుపు చర్య అని, దానితో ఎలాంటి ప్రయోజనమూ ఉండదని కాంగ్రెస్‌ మండిపడింది. గురువారం అర్ధరాత్రి ప్రధాని మోదీ వీడియో విడుదల చేయడంపైనా విమర్శలు చేసింది. ఇది ఏకపక్ష మన్‌కీబాత్‌ కాదని, ప్రధాని పార్లమెంటులో మాట్లాడాలని పేర్కొంది. ప్రధాని మోదీ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది. మరోవైపు, విద్యా సంస్కరణలు, జవాబుదారీతనం కోరుతున్న విద్యార్థులను మోదీ ప్రభుత్వం దేశ శత్రువుల్లా చూస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ విమర్శించారు. దేశంలో విద్యా వ్యవస్థ నాశనం కావడంతోనే విద్యార్థులు ఉద్యమాలు చేపట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కాగా, ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై భద్రతా బలగాలు పెల్లెట్‌ గన్స్‌తో కాల్పులు జరపడం దుర్మార్గమని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. పెల్లెట్‌ గన్‌ వాడలేదంటూ అబద్ధాలు చెబుతున్నారని.. కానీ వాడారనేదానికి సాక్ష్యమిదేనంటూ సాహిల్‌ అనే విద్యార్థికి తగిలిన గాయాలను చూపారు. ఇలాంటి బాధితులు ఎంతో మంది ఉన్నారని.. ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు, పెల్లెట్‌ గన్స్‌ను వినియోగించడంపై ఆర్‌ఏఎఫ్‌ శుక్రవారం అంతర్గత విచారణ చేపట్టింది.

ఈ వార్తలు కూడా చదవండి..

స్థానిక సమస్యలపై దృ‌ష్టి పెట్టండి.. జనసేన నేతలకు మంత్రి మనోహర్ సూచన

అమరావతి ఎన్‌జీఓ టవర్స్ నిర్మాణ పనుల్లో మరో ముందడుగు

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 25 , 2026 | 06:25 AM