Share News

రాజ్యాంగంపై దాడిని తిప్పికొట్టాం

ABN , Publish Date - Apr 18 , 2026 | 05:17 AM

మహిళా కోటా చట్టాన్ని సవరించడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యాంగంపై జరిగిన దాడి అని.. దాన్ని ప్రతిపక్షం ఓడించిందని లోక్‌సభలో విపక్ష నేత...

రాజ్యాంగంపై దాడిని తిప్పికొట్టాం

  • దేశ ఎన్నికల చిత్రపటాన్ని మార్చేందుకు ప్రభుత్వ కుతంత్రమే ఈ బిల్లు

  • మహిళల పేరుతో ఎన్నికల వ్యవస్థను కూల్చే కుట్ర

  • మోదీ సర్కారు ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుకూ, మహిళా కోటా బిల్లుకూ సంబంధం లేదు

  • వచ్చే 15ఏళ్ల దాకా కులగణనకు, ప్రాతినిధ్యానికి సంబంధం లేకుండా చేయాలని సర్కార్‌ యోచన

  • ఈ బిల్లును ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించం

  • దేశంలో ఓబీసీలకు ప్రాతినిధ్యం, అధికారం కల్పించేందుకు సర్కార్‌ వెనకాడుతోంది: రాహుల్‌

  • ప్రజాస్వామ్యాన్ని కూల్చే ప్రయత్నం.. ఖర్గే ధ్వజం

  • మోదీ ముసుగు వీడింది: ప్రియాంకా గాంధీ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): మహిళా కోటా చట్టాన్ని సవరించడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యాంగంపై జరిగిన దాడి అని.. దాన్ని ప్రతిపక్షం ఓడించిందని లోక్‌సభలో విపక్ష నేత, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు. ఈ బిల్లు మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించింది కాదని, దేశ ఎన్నికల నిర్మాణాన్ని మార్చే ప్రయత్నమని దుయ్యబట్టారు. మహిళా రిజర్వేషన్లకు సంబంధించి శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగసవరణ బిల్లు వీగిపోయిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్లమెంటులో మహిళలకు రిజర్వేషన్లపై మోదీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. ఆయన 2023నాటి చట్టాన్ని తీసుకురావాలని, అప్పుడు ప్రతిపక్షాలు దానికి బేషరతుగా మద్దతు ఇస్తాయని స్పష్టం చేశారు. ‘‘నేను చెప్పినట్టుగా ఇది రాజ్యాంగంపై దాడి. అయితే, దాన్ని మేం ఓడించాం’’ అని పేర్కొన్నారు. అనంతరం.. ‘‘రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. మహిళల పేరుతో రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి వారు రాజ్యాంగవిరుద్ధమైన ట్రిక్‌ను ఉపయోగించారు’’ అని ‘ఎక్స్‌’లో హిందీలో ఒక పోస్టు పెట్టారు. ‘‘భారతదేశం (ఇండియా) దీన్ని చూసింది.. ‘ఇండియా’ (కూటమి) దీన్ని ఆపింది. రాజ్యాంగం వర్థిల్లాలి’’ అని అందులో పేర్కొన్నారు. అంతకుముందు.. ఈ బిల్లులపై లోక్‌సభలో చర్చ సందర్భంగా కూడా రాహుల్‌ మోదీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు దేశ వ్యతిరేక బిల్లు అని.. ఈ బిల్లుకూ మహిళా రిజర్వేషన్‌కూ ఏ మాత్రం సంబంధం లేదని.. దేశ ఎన్నికల చిత్రపటాన్ని మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కుతంత్రమని.. పైకి మాత్రం తాము మహిళలకు అనుకూలమని చిత్రించేందుకు మోదీ సర్కారు యత్నిస్తోందని.. ఇదో సిగ్గుమాలిన చర్య అని నిప్పులు చెరిగారు.


మహిళా రిజర్వేషన్‌, డీలిమిటేషన్‌కు సంబంధించి మోదీ సర్కారు లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లులపై చర్చ సందర్భంగా మాట్లాడిన రాహుల్‌.. ఈ (131వ రాజ్యాంగ సవరణ) బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించబోమని ఆయన స్పష్టం చేశారు. తమ బలం రోజురోజుకూ క్షీణిస్తున్నదని తెలిసిన ప్రధాని.. భయకంపితుడై భారత రాజకీయ చిత్రపటాన్ని తారుమారు చేయాలనుకున్నారని.. ఇదే పని జమ్ముకశ్మీర్‌లో, అసోంలో చేశారని, ఇప్పుడు దేశవ్యాప్తంగా చేయగలమని ఊహిస్తున్నారని విమర్శించారు. దేశంలో ఓబీసీలకు ప్రాతినిధ్యం, అధికారం కల్పించేందుకు ప్రభుత్వం వెనుకాడుతోందని.. అదే వారి నిజమైన ఎజెండా అని రాహుల్‌ ధ్వజమెత్తారు. ఈ బిల్లుల ద్వారా.. వచ్చే 15 ఏళ్ల పాటు కులగణనకు, ప్రాతినిధ్యానికిసంబంధం లేకుండా చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. ఈ బిల్లు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదం పొందదనే విషయం బీజేపీకి తెలుసన్నారు.

ప్రాతినిధ్యాన్ని కొల్లగొట్టడమే..

దక్షిణాది, ఈశాన్య, చిన్న రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని కొల్లగొట్టి అధికారంలో కొనసాగడమే మోదీ సర్కార్‌ ధ్యేయమని రాహుల్‌ ఆరోపించారు. ప్రభుత్వం ఇలా చేయడాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమన్నారు. దేశంపై దాడిచేయడానికి, సమాజంలో ఓబీసీలు, దళితులకు దక్కాల్సిన సరైన స్థానాన్ని దూరం చేయడానికి సర్కారు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని విపక్షాలన్నీ కలిసి ఓడిస్తాయని హెచ్చరించారు. బాలాకోట్‌ దాడులు, పెద్ద నోట్ల రద్దు, ఆపరేషన్‌ సింధూర్‌ విషయంలో మోదీ గారడీలు చేశారని రాహుల్‌ వ్యాఖ్యానించినప్పుడు.. సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. దీంతో, మోదీనుద్దేశించి ఆయన చేసిన ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు. అలాగే.. ఒక గారడీవాడు, వ్యాపారవేత్తల మధ్య భాగస్వామ్యం ఉన్నదని, వారి వెనుక తీవ్రంగా బలమైన ఒక కనపడని శక్తి ఉన్నదని రాహుల్‌ వ్యాఖ్యానించారు. మొత్తం కార్పొరేట్‌ ఇండియాలో దళితులు, ఆదివాసీలు, ఓబీసీలకు స్థానం ఎక్కడ? అని ఆయన ప్రశ్నించారు. ‘‘రాహుల్‌ సైనిక దళాలను అవమానించారు’’ అన్న మంత్రి కిరెన్‌ రిజిజు చేసిన వ్యాఖ్యలపైనా ఆయన స్పందించారు. తామే భారతీయ ప్రజలని, తామే సాయుధ దళాలని బీజేపీ అనుకుంటోందని దుయ్యబట్టారు.

ఏప్రిల్‌ 16 మతలబు ఏమిటి?

మహిళా కోటా, పునర్విభజన బిల్లులను సభలోప్రవేశపెట్టిన ఏప్రిల్‌ 16వ తేదీకి ప్రాధాన్యం ఉందంటూ.. రాహుల్‌ తన ముగింపు ప్రసంగంలో విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. మోదీ గురువారం చేసిన ప్రసంగంలో జోరు కనిపించలేదని, అదే సమయంలో తన మొబైల్‌లో ఈరోజు ఏప్రిల్‌ 16 ఇదా రహస్యం అని ఆశ్చర్యపోయానని రాహుల్‌ చెప్పారు. బిల్లులను ప్రవేశపెట్టినపడు భయాన్ని గమనించానన్నారు. తాను ఎందుకు ఈ విషయం అంటున్నానో తెలిస్తే తనకు మెసేజ్‌ పంపాలని అన్నారు. కాని ఈ విషయం త్వరలో తెలుస్తుందని చెప్పారు. కాగా మోదీ ప్రభుత్వానికి కీలక మద్దతు నిస్తున్న తెలుగుదేశం ఎంపిల సంఖ్య 16 అని కొందరువ ఊహిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ తన ట్విట్టర్‌ లో ఏప్రిల్‌ 16 అంటే ఎపిస్టీన్‌ అని ధ్వనించడం లేదా.. అని వ్యాఖ్యానించడం గమనార్హం.


నాకూ మోదీకి భార్యలు లేరు

నిత్యజీవితంలో స్త్రీలు తల్లులుగా, చెల్లెళ్లుగా, అక్కలుగా, భార్యలుగా కీలక పాత్ర పోషిస్తారని తన ప్రసంగంలో వ్యాఖ్యానించిన రాహుల్‌.. తనకూ, మోదీకి భార్యల సమస్య లేదని చమత్కరించినప్పుడు సభలో ఉన్నవారంతా పెద్దగా నవ్వారు. తాను చిన్నప్పుడు కుక్కలు, చీకటి అంటే భయపడేవాడినని.. కానీ, భయం అనేది మనసుకు సంబంధించిన విషయమని తన నానమ్మ ఇందిరాగాంధీ చెప్పారని.. తనను రాత్రిపూట ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లి, గార్డెన్‌లో నిలబెట్టారని రాహుల్‌ గుర్తుచేసుకున్నారు. ‘‘చీకటికి నువ్వు భయపడకూడదు. ఎందుకంటే, నిజం చాలావరకూ చీకట్లోనే ఉంటుంది. చీకటిని, భయాలను ఎదుర్కొనే ధైర్యం నీకు లేకపోతే.. సత్యాన్ని నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోలేవు. సత్యం కోసం పోరాడలేవు’’ అని తన నానమ్మ తనకు చెప్పారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో మహిళల నుంచి పాఠాలు నేర్చుకుంటారని చెప్పిన రాహుల్‌.. ప్రియాంకాగాంధీ గురువారం చేసిన ప్రసంగాన్ని ప్రశంసించారు. గత 20 ఏళ్లుగా తాను చేయలేని పనిని ప్రియాంక చేశారని.. అమిత్‌ షాను కూడా నవ్వేలా చేశారని రాహుల్‌ అన్నప్పుడు సభ్యులందరూ మరోసారి గట్టిగా నవ్వారు. కాగా.. ప్రజాస్వామ్యాన్ని కూల్చాలన్న మోదీ ప్రభుత్వ ప్రయత్నాన్ని ప్రతిపక్షాలన్నీ ఏకమై అడ్డుకున్నాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ‘ఎక్స్‌’లో ఒక పోస్టు పెట్టారు. మోదీ, అమిత్‌ షా దేశ జనాభాలో సగభాగాన్ని రక్షణ కవచంగా వాడుకుని డీలిమిటేషన్‌ను బలవంతంగా రుద్దాలని చూశారని ఆయన మండిపడ్డారు.

1.jpg

మోదీ ముసుగు వీడింది: ప్రియాంక

బీజేపీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్‌ను డీలిమిటేషన్‌కు, పాత జనాభా లెక్కలకు ముడిపెట్టడాన్ని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తప్పుపట్టారు. హత్రాస్‌, ఉన్నావ్‌, మణిపూర్‌ ఘటనలు, రెజ్లర్ల ఆందోళనల సమయంలో తనకేమీ పట్టనట్లు ఉన్న మోదీ, ఇప్పుడు మహిళల హితవు కోసం ఉపన్యాసాలు ఇస్తారా? అని ప్రశ్నించారు. రిజర్వేషన్‌ మహిళల సహజ హక్కు అని, దానిని ఎవరూ ఆపలేరని ఆమె స్పష్టం చేశారు. రాజకీయ దురుద్దేశంతో తీసుకొచ్చిన బిల్లు వీగిపోయిందని, ఇక.. మోదీ ధరించిన మహిళా రక్షకుడు అనే ముసుగు వీడిపోయిందని ప్రియాంక వ్యాఖ్యానించారు. ఈ బిల్లులు ప్రస్తుత రూపంలో ఆమోదం పొంది ఉంటే దేశ ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థకం అయ్యేదన్న ఆమె.. బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన ప్రతిపక్ష ఎంపీలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. రిజర్వేషన్ల అంశాన్ని ప్రమాదకరమైన నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టాలని చూసిన ప్రధాని, హోంమంత్రుల కుయుక్తులు లోక్‌సభలో ఓడిపోయాయని జైరామ్‌ రమేష్‌ విమర్శించారు. ఈ బిల్లులు వీగిపోవడం రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి లభించిన విజయమని కేసీ వేణుగోపాల్‌ అన్నారు.

Updated Date - Apr 18 , 2026 | 05:17 AM