Share News

ఫారం-6ను మార్చిందెవరు?

ABN , Publish Date - Oct 02 , 2026 | 01:40 AM

ఆన్‌లైన్‌లో కొత్త ఓటరు నమోదుకు వినియోగించే ఫారం-6లో నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేశారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు.

ఫారం-6ను మార్చిందెవరు?
rahulgandhi

  • అలా మార్చమని టీసీఎస్‌కు చెప్పిందెవరు?: రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ, అక్టోబరు 1: ఆన్‌లైన్‌లో కొత్త ఓటరు నమోదుకు వినియోగించే ఫారం-6లో నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేశారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఈ పనిని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌)కు అప్పగించిన ఎన్నికల అధికారి ఎవరంటూ ఆయన ప్రశ్నించారు. దీనికోసం టీసీఎస్‌లో ఎవరు ఒప్పందం చేసుకుని సంతకం చేశారని, బలవంతంగా ఏమైనా ఆ సంస్థను ఒప్పించారా అని ‘ఎక్స్‌’లో ఆయన నిలదీశారు. రాహుల్‌ వ్యాఖ్యలను ట్యాగ్‌ చేస్తూ ఆ పార్టీకి చెందిన జాతీయ కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ ఈ వ్యవహారంపై స్పందించారు. ఫారం-6లో మా ర్పులు కేంద్ర హోం మంత్రి, ప్రధాని ఆదేశాలతోనే జరిగాయని, ఓటరు జాబితానుంచి జన్‌జీని తొలగించడం లక్ష్యంగా ఇందుకు పూనుకున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలుచేశారు. ఈ ఏడాది జూలై మధ్యలో రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఫారం-6ను జాతీయ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ) మార్చారని ఆయన ఆరోపించారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా డిమాండ్‌తో దేశవ్యాప్తంగా భారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని బుధవారం జరిగిన ఇండియా కూటమి నిర్ణయించిన నేపథ్యంలో జైరామ్‌ రమేశ్‌ వ్యాఖ్య లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘సర్‌’, ఇతర ఉల్లంఘనల గురించి మాజీ సీఈసీ ఓపీ రావత్‌ ఓ జాతీ య పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలోని అంశాలను ఆయన ప్రస్తావించారు. స్వాతంత్య్ర భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద సంఖ్యలో అర్హులైన ఓటర్లు ఓటు హక్కును కోల్పోవడం ఇదే తొలిసారి అని ఆయన ధ్వజమెత్తారు. ‘ఓటుచోరీ’ వ్యవహారాన్ని మరెంతోకాలం ప్రజలు సహించబోరన్నారు.


‘సర్‌’ విషయంలో సీఈసీ, కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబడుతూ, రాహుల్‌ చేస్తున్న వరుస విమర్శలపై బీజేపీ దీటుగా ప్రతిస్పందించింది. దేశ రాజకీయాల్లో అగ్రగామి మోసగాడు రాహుల్‌గాంధీ అంటూ దుయ్యబట్టింది. ‘చెల్లని కాసు’గా ఆయనను అభివర్ణించింది. ‘‘రాహుల్‌ లౌకికవాద పరిరక్షకుడుగానీ, రాజ్యాంగ రక్షకుడుగానీ కాదు’’ అని బీజేపీ సీనియర్‌ నేత రాజీవ్‌ చంద్రశేఖర్‌ అన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

మహా' విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థుల మృతి

నాడు నానీ.. నేడు మచ్చార్.. ఇజ్రాయెలీలకు అండగా భారతీయులు

Updated Date - Oct 02 , 2026 | 02:07 AM