రాహుల్ ధర్నాపై రాజకీయ దుమారం!
ABN , Publish Date - Jul 22 , 2026 | 05:37 AM
కాక్రోచ్ జనతా పార్టీ ‘సంసద్ చలో’ కార్యక్రమాన్ని ఢిల్లీ పోలీసులు ఉక్కుపాదంతో అణచివేసిన మర్నాడే ప్రధాని ఇంటి సమీపంలో రాహుల్‌గాంధీ ధర్నా చేసిన సంఘటన తీవ్ర...
ఇది బీజేపీ, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగేనన్న ఆప్
తమను రాజకీయ రొచ్చులోకి లాగొద్దన్న సీజేపీ
న్యూఢిల్లీ, జూలై 21: కాక్రోచ్ జనతా పార్టీ ‘సంసద్ చలో’ కార్యక్రమాన్ని ఢిల్లీ పోలీసులు ఉక్కుపాదంతో అణచివేసిన మర్నాడే ప్రధాని ఇంటి సమీపంలో రాహుల్‌గాంధీ ధర్నా చేసిన సంఘటన తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైంది. ఢిల్లీలో ప్రధాన పార్టీలైన ఆమ్‌ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, బీజేపీల మధ్య పరస్పర ఆరోపణలకు వేదికైంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాయని, సీజేపీ ఉద్యమాన్ని బలహీనం చేసేందుకు మోదీ పంపిస్తేనే రాహుల్‌గాంధీ వచ్చి ధర్నాకు కూర్చున్నారని ఆప్ ఆరోపించింది. వాంగ్‌చుక్ సీజేపీతో కలిసి నెల రోజులుగా ధర్నా చేస్తున్నా కేంద్రం పట్టించుకోలేదని గుర్తు చేసింది. రాహుల్ ఏకంగా ప్రధాని ఇంటి ఎదుటే ధర్నా చేయగలిగారని చెప్పింది. ఆయన ధర్నాకు కూర్చున్న గంటలోనే ప్రభుత్వం చర్చలకు రావడం కాంగ్రెస్, బీజేపీల మధ్య జుగల్బందీని తలపిస్తోందని ఆప్ నేత, ఢిల్లీ మాజీ సీఎం ఆతిషి అన్నారు. మరోవైపు, విద్యార్థులపై ప్రభుత్వం దౌర్జన్యం గురించి నిలదీయడానికే తాము ప్రధాని నివాసం వద్దకు వచ్చామని రాహుల్‌గాంధీ ప్రకటించారు. నీట్‌పై ప్రభుత్వంలో జవాబుదారీతనం కొరవడటం, కనీసం పార్లమెంటులో చర్చించేందుకు నిరాకరించడం వల్లే తాము ధర్నాకు దిగాల్సి వచ్చిందన్నారు. బీజేపీ కూడా ఆప్‌ను పట్టించుకోకుండా మాట్లాడింది కానీ పరోక్షంగా ఆప్ ఆరోపణలకు సమాధానం ఇచ్చింది. రాహుల్‌గాంధీ మొదట పార్లమెంటులో నీట్‌పై చర్చను డిమాండ్ చేశారని, ధర్నా దగ్గరకు వచ్చి నీట్‌పై చర్చకు సిద్ధమని తాము చెప్పగానే ఆయన మాట మార్చి విద్యామంత్రి రాజీనామాను కోరుతున్నారని మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. పరోక్షంగా తమకు, కాంగ్రె్‌సకు మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ లేదని చెప్పారు. మరోపక్క కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు కేంద్రమంత్రి నడ్డాతో సమావేశమై విద్యా సంస్కరణలపై చర్చించారు. విద్యామంత్రి రాజీనామాకు డిమాండ్ చేశారు. ఇదే సందర్భంగా తమకు కాంగ్రెస్ సహా ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ప్రకటించారు. పరోక్షంగా సీజేపీ నేతలు ఈ రాజకీయ రొచ్చులో తమను దింపొద్దని కాంగ్రెస్, ఆప్‌లకు సందేశమిచ్చారు. ఒకప్పటి మాతృసంస్థ ఆప్‌కు తనకు సంబంధం లేదని దీప్కే ఈ ప్రకటన ద్వారా తేల్చిచెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ప్రభుత్వ అధీనంలోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
తప్పిపోయి.. జొన్నచేనులో నిద్రపోయి..!