Share News

ప్రధాని నివాసం ముట్టడి

ABN , Publish Date - Jul 22 , 2026 | 06:12 AM

దేశ రాజధాని ఢిల్లీ వరుసగా రెండో రోజూ దద్దరిల్లింది. నీట్‌ తదితర పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ, విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్‌ వ్యవహారం రాజధానిని కుదిపేసింది. కాంగ్రెస్‌ అగ్రనేత...

ప్రధాని నివాసం ముట్టడి

ఢిల్లీలో కాంగ్రెస్‌ నాయకుల మెరుపు ధర్నా

విద్యార్థులపై లాఠీచార్జి నిరసిస్తూ బైఠాయింపు.. మోదీ, షా రాజీనామాకు డిమాండ్‌

ధర్నాలో పాల్గొన్న ఖర్గే, రాహుల్‌, ప్రియాంక, సీఎంలు డీకే, సతీశన్‌ తదితరులు

3 గంటలకు పైగా నిరసన.. కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ చర్చలు.. ఫలించని వైనం

నేతల అరెస్టు.. రాహుల్‌ను లాక్కెళ్లిన పోలీసులు.. విపక్ష నేతకు స్వల్ప గాయాలు

నీట్‌పై చర్చిస్తే ధర్నా విరమిస్తామని, తర్వాత మాట మార్చారు: జితేంద్రసింగ్‌

న్యూఢిల్లీ, జూలై 21 (ఆంధ్రజ్యోతి): దేశ రాజధాని ఢిల్లీ వరుసగా రెండో రోజూ దద్దరిల్లింది. నీట్‌ తదితర పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ, విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్‌ వ్యవహారం రాజధానిని కుదిపేసింది. కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌, మిత్రపక్షాలు మంగళవారం సాయంత్రం అనూహ్యంగా 7, లోక్‌ కళ్యాణ్‌ మార్గ్‌లోని ప్రధాని నివాసాన్ని ముట్టడించాయి. మూడు గంటలకు పైగా కొనసాగిన ఈ మెరుపు ధర్నాతో కేంద్ర ప్రభుత్వం ఉలిక్కిపడింది. రాహుల్‌ గాంధీతోపాటు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌, కేరళ, కర్ణాటక ముఖ్యమంత్రులు వీడీ సతీశన్‌, డీకే శివకుమార్‌, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, ఎన్సీపీ నేత సుప్రియా సూలే, ఇండియా కూటమి పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు ముట్టడిలో పాల్గొన్నారు. ముందస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామంతో పోలీసులు, భద్రతాసిబ్బంది ఖంగుతిన్నారు. ధర్నా విరమించాలంటూ కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ వచ్చి కాంగ్రెస్‌ నాయకులను అభ్యర్థించారు. అందుకు వారు సమ్మతించకపోవటంతో, పోలీసులు వారిని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో రాహుల్‌గాంధీ ముఖం, చేతుల మీద స్వల్ప గాయాలయ్యాయి. ఈ నిరసన ప్రణాళికను కాంగ్రెస్‌ నాయకత్వం అత్యంత రహస్యంగా ఉంచింది. లాఠీచార్జీలో గాయపడి ఢిల్లీలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను రాహుల్‌, ప్రియాంక, కేసీ వేణుగోపాల్‌ తదితర కాంగ్రెస్‌ నేతలు మంగళవారం ఉదయం పరామర్శించారు. అక్కడి నుంచి ఖర్గే నివాసానికి వెళ్లారు. మంగళవారం ఖర్గే జన్మదినం కావటంతో ఆయనను అభినందించారు. అక్కడి నుంచి విజయ్‌చౌక్‌కు ర్యాలీగా వెళ్లి అక్కడ నిరసన తెలపాలన్నది కాంగ్రెస్‌ ఆలోచన. అయితే, ఈ విషయం బయటకు తెలియటంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ ప్రణాళిక ప్రకారమే ముందుకెళ్తే పోలీసులు అడ్డుకునే అవకాశాలే ఉన్నాయని తెలియటంతో.. కాంగ్రెస్‌ నేతలు ప్రణాళిక మార్చారు. ఖర్గే నివాసానికి 2.3 కి.మీ.ల దూరంలో ఉండే ప్రధాని మోదీ నివాసం వద్దకు వెళ్లి మెరుపు ధర్నాకు దిగాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎంపీలను ఖర్గే నివాసానికి పిలిపించారు. విషయం తెలిసి ఎంపీలు సైతం ఆశ్చర్యపోయారు. కేరళ సీఎం సతీశన్‌, కర్ణాటక సీఎం శివకుమార్‌ సైతం హుటాహుటిన వచ్చారు. ఖర్గే నివాసం నుంచి బయటకు వచ్చిన కాంగ్రెస్‌ నేతలు అక్కడి నుంచి బయల్దేరి, ప్రధాని నివాసం వద్దకు వచ్చి అక్కడ అకస్మాత్తుగా బైఠాయించారు. అది భద్రతపరంగా అత్యంత సున్నితమైన ప్రాంతం కావటంతో.. ఈ హఠాత్‌ పరిణామంతో పోలీసు సిబ్బంది నివ్వెరపోయారు. ధర్నాకు దిగిన కాంగ్రెస్‌ నేతలు.. విద్యార్థులపై దమనకాండకు బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. దేశంలో ప్రజల స్వేచ్ఛపై ప్రభుత్వం ఆంక్షలను అమలు చేస్తుందనటానికి నిదర్శనంగా తమ చేతులను జిప్‌ టైలతో బంధించుకున్నారు.


‘దేశ యువత భవిష్యత్తును నాశనం చేశారు. విద్యార్థులపై దాడి అంటే ప్రతి భారతీయ కుటుంబంపై దాడి చేయడమే. మోదీ, అమిత్‌ షా వెంటనే రాజీనామా చేయాలి. ప్రతి దేశభక్తుడైన భారతీయుడూ ఈ పోరాటంలో కలిసిరావాలి’ అని రాహుల్‌ గాంధీ పిలుపునిచ్చారు. ఎటువంటి పర్యవసానాలు, జవాబుదారీతనం లేకుండా తప్పించుకోవచ్చని మోదీ భావిస్తున్నారుగానీ.. ఈసారి అలా జరగదని హెచ్చరించారు. ‘విద్యార్థుల మీద జరిపిన దారుణమైన లాఠీచార్జీకి ఈ పిరికిపంద, నియంతృత్వ ప్రభుత్వం జవాబు చెప్పాలి. యువతకు మోదీ, అమిత్‌షా ద్రోహం చేశారు. వారు రాజీనామా చేయాలి’ అని ఖర్గే డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ధర్నాతో ప్రధాని నివాసానికి వెళ్లే మార్గాలన్నింటినీ పోలీసులు బారికేడ్లతో మూసివేశారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

రాహుల్‌తో జితేంద్రసింగ్‌ చర్చలు

పరిస్థితి తీవ్రతను గ్రహించిన కేంద్ర ప్రభుత్వం.. విపక్షాలను శాంతింపజేసేందుకు రంగంలోకి దిగింది. దాదాపు 20 నిమిషాల నిరసన తర్వాత, ప్రధానమంత్రి కార్యాలయ(పీఎంవో) సహాయమంత్రి జితేంద్ర సింగ్‌, హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ వచ్చి రాహుల్‌గాంధీతో చర్చలు జరిపారు. అయితే, రాహుల్‌ మాత్రం పట్టు వీడలేదు. ‘యువత భవిష్యత్తును నాశనం చేసినందుకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా రాజీనామా చేయాల్సిందే’ అని డిమాండ్‌ చేశారు. రాయబార యత్నాలేవీ ఫలించకపోవడంతో మంత్రి జితేంద్ర సింగ్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు. చర్చలు ఫలించలేదని, తాము రాత్రంతా ఇక్కడే ఉండి, ధర్నా జరుపుతామని కాంగ్రెస్‌ నేతలు ప్రకటించారు. కాగా, కాంగ్రెస్‌ పార్టీ ప్రధానంగా మూడు కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది.

1. నీట్‌ అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెంటనే రాజీనామా చేయాలి.

2. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీచార్జి చేయించినందుకు, అక్రమ కేసులు బనాయించినందుకు హోంమంత్రి అమిత్‌ షా బేషరతుగా క్షమాపణ చెప్పి పదవి నుంచి తప్పుకోవాలి.

3. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలలో నీట్‌ అంశంతో పాటు దేశంలో విద్యావ్యవస్థ వైఫల్యాలపై పూర్తిస్థాయి చర్చ జరపాలని డిమాండ్‌ చేసింది.

అయితే, కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ దీనికి భిన్నమైన వాదన వినిపించారు. ‘నీట్‌ పరీక్షకు సంబంధించిన అంశాలపై పార్లమెంటులో చర్చకు ప్రభుత్వం అంగీకరిస్తే తాను వెంటనే ధర్నాను విరమిస్తానని రాహుల్‌ గాంధీ చెప్పారు. మా ప్రభుత్వ అగ్రనాయకత్వం అనుమతితో కొద్దిసేపట్లోనే ఆయన డిమాండ్‌కు ఆమోదం తెలిపాం. నీట్‌ అంశంపై పార్లమెంట్‌లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్థంగా ఉందనే హామీని రాహుల్‌గాంధీకి నేను స్వయంగా తెలిపాను. కానీ, ఆయన మాట మార్చారు. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలనే కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. మొదట కేవలం చర్చ మాత్రమే కోరారని మేం గుర్తు చేయగా, ‘ఇప్పుడు నా డిమాండ్లు మారాయి’ అని ఆయన సమాధానమిచ్చారు. ఆయన లాంటి సీనియర్‌ నేత ఇచ్చిన మాట నుంచి అంత త్వరగా వెనక్కి తగ్గడం ఏమిటంటూ వివరించేందుకు ప్రయత్నించగా, అది నా ఇష్టమంటూ రాహుల్‌ బదులిచ్చారు. రాహుల్‌ గాంధీ ప్రవర్తన ప్రజాస్వామ్య సూత్రాలకు ఏమాత్రం తగినట్లుగా లేదు’ అని జితేంద్రసింగ్‌ విమర్శించారు.


8-National.jpg

రాహుల్‌ ధర్నాపై రాజకీయ దుమారం!

ఇది బీజేపీ, కాంగ్రెస్‌ మ్యాచ్‌ ఫిక్సింగేనన్న ఆప్‌

వాంగ్‌చుక్‌ను పట్టించుకోలేదు

రాహుల్‌ వద్దకు మంత్రి గంటలో వాలిపోయారు: ఆతిషి

ప్రధానిని నిలదీసేందుకు వెళ్లామన్న రాహుల్‌

తమను రాజకీయ రొచ్చులోకి లాగొద్దన్న సీజేపీ

రాహుల్‌ గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు ధర్నాను విరమించటానికి కాంగ్రెస్‌ నేతలు అంగీకరించకపోవటంతో పోలీసులు వారిని బలవంతంగా తీసుకెళ్లటానికి ప్రయత్నించారు. రాహుల్‌గాంధీ ప్రతిఘటిస్తున్నప్పటికీ ఏమాత్రం లెక్కచేయకుండా నేల మీద నుంచే ఈడ్చుకెళ్లారు. ఫలితంగా, రాహుల్‌కు స్వల్పగాయాలయ్యాయి. ఆయన ముక్కు నుంచి రక్తం కారినట్లుగా కనిపించింది. ఈ సమయంలో రాహుల్‌ విలేకరులతో మాట్లాడుతూ ‘భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిస్థితికి ఇది ప్రత్యక్ష నిదర్శనం’ అంటూ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ప్రియాంక గాంధీని సైతం పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి వాహనంలోకి తీసుకెళ్లారు. పంజాబ్‌ మాజీ సీఎం చరణ్‌జిత్‌సింగ్‌చన్ని, కే సురేశ్‌, సుఖీందర్‌ రణ్‌ద్వా, పవన్‌ఖేరా తదితరులను కూడా పోలీసులు బలవంతంగా తరలించారు. అరెస్టు చేసిన నేతలను ఢిల్లీ పోలీసులు వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. రాహుల్‌ను ఛత్రసాల్‌ స్టేడియంలో, ప్రియాంక గాంధీజీని మందిర్‌ మార్గ్‌ పోలీస్‌ ేస్టషన్‌లో ఉంచారు. మందిర్‌ మార్గ్‌ పోలీసు స్టేషన్‌లో ఉన్న ప్రియాంక సహా ఇతర ఎంపీలను కలిసేందుకు కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ వెళ్లారు. అయితే, పోలీసులు సోనియాగాంధీని లోపలికి అనుమతించలేదు. రాత్రి పొద్దుపోయిన తర్వాత రాహుల్‌, ప్రియాంక తదితర కాంగ్రెస్‌ నేతలను పోలీసులు విడుదల చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి:

ప్రభుత్వ అధీనంలోనే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు

తప్పిపోయి.. జొన్నచేనులో నిద్రపోయి..!

Updated Date - Jul 22 , 2026 | 06:12 AM