Share News

ఆలింగనాలే మోదీ విదేశాంగ విధానం

ABN , Publish Date - Aug 14 , 2026 | 05:55 AM

వివిధ దేశాల అధినేతలతో ప్రధాని మోదీ ఆలింగనాలను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ ఎద్దేవా చేశారు. రచనాత్మక్‌ కాంగ్రెస్‌ జాతీయ సదస్సు వేదికపై కాంగ్రెస్‌ నేత సందీప్‌ దీక్షిత్‌ను పిలిచి మరీ గట్టిగా...

ఆలింగనాలే మోదీ విదేశాంగ విధానం

  • ‘రచనాత్మక్‌ కాంగ్రెస్‌ సదస్సు’లో రాహుల్‌

  • కాంగ్రెస్‌ నేత దీక్షిత్‌ను ఆలింగనం చేసుకుని .. మోదీ తీరు ఇలా ఉంటుందని ఎద్దేవా

  • రాహుల్‌ వ్యాఖ్యలు నీచంగా ఉన్నాయని మండిపడిన బీజేపీ నేతలు

  • దేశ రాజకీయాలకే తలవంపు: సంజయ్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 13: వివిధ దేశాల అధినేతలతో ప్రధాని మోదీ ఆలింగనాలను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ ఎద్దేవా చేశారు. రచనాత్మక్‌ కాంగ్రెస్‌ జాతీయ సదస్సు వేదికపై కాంగ్రెస్‌ నేత సందీప్‌ దీక్షిత్‌ను పిలిచి మరీ గట్టిగా ఆలింగనం చేసుకున్న రాహుల్‌.. ఇలా ఆలింగనం చేసుకోవడమే మోదీ విదేశాంగ విధానమని మండిపడ్డారు. ‘ఆయనకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు. జనాల బుర్రలోకి వింత ఆలోచనలు వస్తుంటాయి. దీన్నే ఆయన విదేశాంగ విధానమని అనుకుంటుంటారు’ అని మోదీపై విమర్శలు గుప్పించిన రాహుల్‌.. ఆపై దీక్షిత్‌ వద్దకు వడివడిగా వెళ్లి గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. ‘నన్ను మెలోనీ అనుకుని ఆలింగనం చేసుకోలేదు కదా?’ అని దీక్షిత్‌ వ్యంగ్యంగా అడగ్గా ‘నేనింకా ఆ స్థాయికి చేరుకోలేదు’ అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. దీంతో సమావేశం మందిరం సభికుల చప్పట్లు, నవ్వులతో ప్రతిధ్వనించింది. ఢిల్లీలో గురువారం జరిగిన ఈ సదస్సులో రాహుల్‌ బీజేపీ, ఆరెస్సె్‌సలపై విరుచుకుపడ్డారు. అవి జోకర్ల సమూహమని, వారికి భారతదేశ చరిత్ర, సంస్కృతి, ప్రస్తుత వాస్తవ పరిస్థితుల గురించి అవగాహన లేదని విమర్శించారు. బీజేపీ-ఆర్‌ఎ్‌సఎస్‌ రాజకీయ సిద్ధాంతం ఏమిటంటే.. తమకు, మరికొంతమందికి ప్రయోజనం చేకూర్చే ఒక వ్యవస్థను దేశంపై రుద్దడమేనన్నారు. కాంగ్రెస్‌ మాత్రం దేశాన్ని తన భావాలను వ్యక్తీకరించేందుకు అనుమతించాలని కోరుకుంటోందని చెప్పారు. జంతర్‌ మంతర్‌ వద్ద విద్యార్థులు తమ భావాలను చెప్పాలనుకున్నారని, ప్రభుత్వం దానికి అంగీకరించలేదన్నారు. ఒకప్పుడు స్వతంత్ర శక్తిగా ఉన్న ఆరెస్సెస్‌ ఇప్పుడు చనిపోయిందని, మోదీలాగే ఆరెస్సెస్‌ వారు కూడా గౌతమ్‌ అదానీ, ముకేశ్‌ అంబానీకి సేవకులుగా మారిపోయారని విమర్శించారు. రాజీనామా చేసే వరకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాలను నిద్రపోనీయమన్నారు.


బీజేపీ నేతల ఫైర్‌

రాహుల్‌ ‘ఆలింగనం విమర్శల’పై రాజకీయ దుమారం రేగింది. మోదీపై ఆయన వ్యాఖ్యలు నీచంగా ఉన్నాయని బీజేపీ ధ్వజమెత్తింది. రాహుల్‌ అనాగరిక, అనుచిత భాష ప్రతిపక్ష నేత స్థాయిని దిగజార్చేలా ఉందని విమర్శించింది. మోదీని, ఇటలీ ప్రధాని మెలోనీని హేళన చేయడం, దానికి కాంగ్రెస్‌ నాయకులు పగలబడి నవ్వడం.. ఆ పార్టీ రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని పేర్కొంది. ‘రాహుల్‌ ఇంకెప్పుడు ఎదుగుతారు? దేశాన్ని నడిపించడానికి పరిణతి కలిగిన నాయకత్వం అవసరం. అంతేకానీ కానీ మీ అపరిపక్వ డ్రామాలు కాద’ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి అన్నారు. రోత పుట్టించే చౌకబారు భాషతో ప్రధానిపై విమర్శలు చేయడం రాజకీయం అనిపించుకోదని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ హితవు పలికారు. రాహుల్‌ తీరు దేశ రాజకీయాలకు తలవంపులు తెచ్చేలా ఉందని విమర్శించారు. ఇంకా పలువురు ఎంపీలు, బీజేపీ నేతలు, మహిళా మోర్చా సహా వివిధ విభాగాల నేతలు రాహుల్‌పై మండిపడ్డారు. అయితే బీజేపీ విమర్శలపై కాంగ్రెస్‌ స్పందిస్తూ రాహుల్‌ ఎక్కడా మెలోనీ పేరును ప్రస్తావించలేదని పేర్కొంది. ‘రాహుల్‌ మెలోనీ అనే పదాన్నే వాడలేదు. ఆయన సందీప్‌ దీక్షిత్‌ను ఆలింగనం చేసుకున్నారు. ఇందులో తప్పేముంది?’ అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి షామా మొహ్మద్‌ అన్నారు. విదేశీయులు కరచాలనం చేయడానికే ఇష్టపడతారని, బాగా తెలిసినవారైతే తప్ప ఆలింగనానికి ఇష్టపడరని చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి

డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తే వదిలిపెట్టొద్దు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వండి: మంత్రులతో చంద్రబాబు..

అనుమతి లేకుండా ర్యాలీ.. 31మంది వైసీపీ నేతలపై కేసులు..

Updated Date - Aug 14 , 2026 | 05:55 AM