Share News

కేరళ ముఖ్యమంత్రి పదవి.. ఆయన వైపే రాహుల్ గాంధీ మొగ్గు..

ABN , Publish Date - May 10 , 2026 | 05:34 PM

కేరళ ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, మిత్ర పక్షాలతో ఇప్పటికే ఏఐసీసీ పరిశీలకులు చర్చలు జరిపారు. అభిప్రాయ సేకరణ కూడా పూర్తయింది.

కేరళ ముఖ్యమంత్రి పదవి.. ఆయన వైపే రాహుల్ గాంధీ మొగ్గు..
Rahul Gandhi

తిరువనంతపురం, మే 10: ఎన్నికల ఫలితాలు వెలువడి ఆరు రోజులు అవుతున్నా కేరళలో ముఖ్యమంత్రి ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, మిత్ర పక్షాలతో ఇప్పటికే ఏఐసీసీ పరిశీలకులు చర్చలు జరిపారు. అభిప్రాయ సేకరణ కూడా పూర్తయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఎక్కువ శాతం మంది ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వైపు మొగ్గు చూపారు. కానీ, ప్రజల్లో మాత్రం శాసనసభలో విపక్షనేతగా వ్యవహరించిన సీనియర్ నాయకుడు వీడీ సతీశన్ పేరు వినిపిస్తోంది.


సన్నిహితుడి వైపే రాహుల్ మొగ్గు..

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన సన్నిహితుడు కేసీ వేణుగోపాల్ వైపు మొగ్గుచూపుతున్నారు. కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో మల్లిఖార్జున ఖర్గేను కలవడాని కంటే ముందే రాహుల్ గాంధీ.. వేణుగోపాల్‌తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. తాజాగా జరిగిన మీటింగ్‌లో రాహుల్ గాంధీ పోస్టర్ల వివాదాన్ని ప్రస్తావించారు. సతీశన్‌పై వస్తున్న ఆరోపణల గురించి ప్రశ్నించారు. సతీశన్ స్పందిస్తూ.. వేణు గోపాల్‌ను ముఖ్యమంత్రిని చేయటం తనకు ఏమాత్రం ఇష్టం లేదని తేల్చి చెప్పారు.


వేణుగోపాల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉంటూ.. పార్టీలో క్యాంపులు, గ్రూపులను తయారు చేసేందుకు ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చారని సతీశన్ ఆరోపించారు. తాను ఎప్పుడూ స్వంత ప్రయోజనాల కోసం గ్రూపులను తయారుచేయడానికి పనిచేయలేదని, కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా సేవలందించినప్పుడు అందరినీ కలుపుకుని వెళ్లానని చెప్పారు. నెన్మారా, కజకూటం, వడకంచేరి, నెడుమంగాడ్, చేర్తలా నియోజకవర్గాలలో వేణుగోపాల్ చెప్పిన అభ్యర్థులను కాకుండా వేరే వాళ్లను నిలబెట్టి ఉంటే.. పార్టీ మరిన్ని స్థానాలు గెలుచుకుని ఉండేదని సతీశన్ రాహుల్‌కు చెప్పారు. కాగా, ముఖ్యమంత్రి బరిలో వేణుగోపాల్, సతీశన్‌తో పాటు పార్టీ సీనియర్ నేత రమేశ్ చెన్నితాల కూడా ఉన్నారు. ఈ ముగ్గురిలో వేణుగోపాల్‌ వైపే అధిష్ఠానం మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి

సీఎం చంద్రబాబు ఇంటికి ప్రధాని మోదీ.. పలు కీలక అంశాలపై చర్చ

తమిళనాట తెలుగు మహిళకు మంత్రి పదవి.. ఎవరీ కీర్తన?

Updated Date - May 10 , 2026 | 06:10 PM