మహిళా రిజర్వేషన్లపై కేంద్రం తీరును తప్పుబట్టిన రాహుల్ గాంధీ
ABN , Publish Date - Apr 15 , 2026 | 08:20 PM
మహిళా రిజర్వేషన్లపై కేంద్రం తీరును రాహుల్ గాంధీ తప్పుబట్టారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న సవరణ కేవలం అధికారం కోసమేనని అన్నారు. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ బేషరతుగా మద్దతు ఇస్తుందని తేల్చి చెప్పారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: మహిళా రిజర్వేషన్లపై కేంద్రం తీరును రాహుల్ గాంధీ తప్పుబట్టారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న సవరణ కేవలం అధికారం కోసమేనని అన్నారు. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ బేషరతుగా మద్దతు ఇస్తుందని తేల్చి చెప్పారు. బుధవారం బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కుల గణన లేకుండా మహిళా రిజర్వేషన్ల అమలులో పారదర్శకత ఉండదని అభిప్రాయపడ్డారు. చిన్న రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడటమే తమ లక్ష్యమన్నారు. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో కుట్ర జరుగుతోందన్నారు. కుల గణన డేటాను విస్మరించడం అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీల వాటాను దొంగిలించడమేనని అన్నారు. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు అన్యాయం జరిగితే సహించబోమని హెచ్చరించారు.
కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేష్ మాట్లాడుతూ.. ‘మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇస్తున్నాం. మహిళా రిజర్వేషన్లను 2023లోనే అమలు చేయమని కోరాం. మా విజ్ఞప్తిని ఏమాత్రం కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఓటమి నిర్ధారణ కావడంతో, అర్దాంతరంగా ఈ బిల్లును ప్రవేశపెట్టాలని అధికార బీజేపి భావిస్తోంది. డీ లిమిటేషన్ ద్వారా నార్త్, ఈస్ట్, సౌత్, చిన్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. లోక్‌సభ 543 స్థానాల్లోనే మహిళా రిజర్వేషన్లు కల్పించాలి. నియోజకవర్గాల పునర్విభజన బిల్లును వ్యతిరేకిస్తాము’ అని అన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ‘మహిళా రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదు. ప్రభుత్వం తెచ్చిన విధానమే తప్పు. రాజకీయ లబ్ధి కోసమే మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం తెరపైకి తెచ్చింది. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. అస్సాం, జమ్మూ కాశ్మీర్‌లో జరిగినట్లే నియోజకవర్గాల విభజనలో అవకతవకలకు కేంద్రం యత్నిస్తోంది. మహిళా రిజర్వేషన్ల అమలులో జాప్యం చేయడానికే కేంద్రం సాకులు వెతుకుతోంది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా విపక్షాలన్నీ ఐక్యంగా పోరాడతాయి’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టులు.. వైసీపీ నేత గిరీశ్ కుమార్ రెడ్డి అరెస్టు..
ప్రతి పనికి టైమ్‌లైన్ నిర్ణయించి పని చేయాల్సిందే: మంత్రి తుమ్మల