ప్రతి పనికి టైమ్‌లైన్ నిర్ణయించి పని చేయాల్సిందే: మంత్రి తుమ్మల
ABN , Publish Date - Apr 15 , 2026 | 07:28 PM
తెలంగాణలో వ్యవసాయ మార్కెట్ యార్డ్‌ల అభివృద్ధి, పారదర్శకతపై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు మార్కెటింగ్, మార్క్‌ఫెడ్ అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్: తెలంగాణలో వ్యవసాయ మార్కెట్ యార్డ్‌ల అభివృద్ధి, పారదర్శకతపై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు మార్కెటింగ్, మార్క్‌ఫెడ్ అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్కెట్ యార్డ్‌ల అభివృద్ధి పనుల పురోగతి, రైతులకు అందుతున్న సౌకర్యాలపై ఆయన అధికారులతో చర్చించారు. గత రెండు సంవత్సరాల్లో మొత్తం రూ.568.50 కోట్ల వ్యయంతో 630 అభివృద్ధి పనులు మంజూరు చేసినట్లు మంత్రికి అధికారులు వెల్లడించారు. ఇందులో రూ.128 కోట్లతో 113 పనులు పూర్తయ్యాయని నివేదిక సమర్పించారు. మిగిలిన పనులను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.
ప్రతి పనికి టైమ్‌లైన్ నిర్ణయించి వేగంగా ముందుకు తీసుకెళ్లాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. మార్కెట్ యార్డుల్లో 'జీరో బిజినెస్' అంశంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారం చేయకుండా లైసెన్సులు కొనసాగిస్తున్న ట్రేడర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారి లైసెన్సులను రద్దు చేయాలని ఆదేశించారు. అలాంటి వారికి సహకరించే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. అభివృద్ధి పనుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక డ్యాష్‌బోర్డ్ ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, పంట ఉత్పత్తుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు తుమ్మల. గడ్డిఅన్నారం మార్కెట్‌లో ‘స్మార్ట్ మార్కెట్ యార్డ్’ అమలు చేయాలని, డిజిటలైజేషన్ ద్వారా జీరో బిజినెస్ సమస్యను తగ్గించాలని నిర్ణయించారు. కోహెడ మార్కెట్ అభివృద్ధి పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నట్లు ఆయన తెలిపారు.
విద్యుత్ ఖర్చు తగ్గింపుపైనా మంత్రి దృష్టి సారించారు. మార్కెట్ యార్డుల్లో సోలార్ రూఫ్‌టాప్ ప్రాజెక్టులను వేగవంతం చేసి, జులై చివరి నాటికి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలని అన్నారు. వ్యవసాయ కొనుగోళ్ల విషయానికి వస్తే.. ఖరీఫ్ సీజన్‌లో పత్తి కొనుగోళ్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లకు మిర్చి అధికంగా వస్తోందని పేర్కొన్నారు. మరోవైపు ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. టార్పాలిన్లు, తేమ కొలమానాలు, డ్రైయర్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. మొక్కజొన్న కొనుగోళ్లలోనూ రైతులకు పూర్తి రక్షణ కల్పిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. అలాగే రైతుల ఖాతాలకు నేరుగా చెల్లింపులు చేస్తామని స్పష్టం చేశారు. మొత్తం మీద మార్కెట్ యార్డ్‌లను ఆధునీకరించి, రైతులకు అనుకూలంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తుమ్మల వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
డీలిమిటేషన్‌పై సీఎం రేవంత్ అసత్య ప్రచారం: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు
పాటలు తప్ప.. స్కామ్‌లు తెలియవు : సింగర్ మంగ్లీ