Share News

10 ఏళ్లలో 152 పేపర్ లీకులు: రాహుల్ గాంధీ

ABN , Publish Date - Jul 22 , 2026 | 05:26 PM

గత 10 ఏళ్లల్లో 152 పేపర్ లీక్ ఉదంతాలు వెలుగు చూశాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒక్క కేసులో కూడా దోషులు ఎవరో తేలలేదని అన్నారు.

10 ఏళ్లలో 152 పేపర్ లీకులు: రాహుల్ గాంధీ
Rahul Gandhi

ఇంటర్నెట్ డెస్క్: గత 10 ఏళ్లల్లో 152 పేపర్ లీక్ ఉదంతాలు వెలుగు చూశాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒక్క కేసులో కూడా దోషులు ఎవరో తేలలేదని అన్నారు. నీట్ పేపర్ లీక్ ఉదంతంపై ఉద్యమిస్తున్న యువతకు మద్దతుగా రాహుల్ గాంధీ బుధవారం ఏర్పాటు చేసిన పత్రికాసమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో విద్యావ్యవస్థ మొత్తం రిగ్గింగ్ బారిన పడిందని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పనితీరు అసమర్థంగా, అవినీతిమయంగా ఉందని ఆరోపించారు. ఆయన రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఆయన రాజీనామాకు విద్యార్థులు పట్టుబడుతున్నారని, ఇది సరైన డిమాండేనని వ్యాఖ్యానించారు. ఈ దుస్థితికి ప్రతిబింబంగా మారిన ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు.


‘గత పదేళ్లలో సుమారు 152 పేపర్ లీక్ ఉదంతాలు వెలుగు చూశాయి. అంటే.. సగటున వారానికి ఒక పేపర్ లీక్ జరిగింది. కోట్ల మంది విద్యార్థులపై ప్రతికూల ప్రభావం పడింది. కానీ ఒక్క కేసులో కూడా దోషులెవరో తేలలేదు. ఇలా ఎందుకు జరిగిందని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

ఒకప్పుడు దేశానికి సంపదగా ఉన్న విద్యారంగం ఎన్డీయే పాలనలో ధ్వంసమైందని రాహుల్ గాంధీ ఆరోపించారు. పేద, మధ్యతరగతి వర్గాలకు విద్య భారంగా మారిందని చెప్పారు. కోచింగ్‌పై నీట్ అభ్యర్థుల వార్షిక ఖర్చు రూ.1.32 లక్షల కోట్లని అన్నారు. ఇది విద్యారంగం వార్షిక బడ్జెట్‌ రూ.1.42 లక్షల కోట్లకు దాదాపు సమానమని వ్యాఖ్యానించారు. సంపన్నుల కోసమే ఉద్దేశించిన ఈ వ్యవస్థలో పేదలకు స్థానం లేదని అన్నారు. సోమవారం నిరసనల సందర్భంగా విద్యార్థులపై లాఠీచార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రధాని మోదీ విద్యార్థులకు క్షమాపణలు చెప్పాల్సిందేనని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

ప్లీజ్ దీక్ష విరమించండి.. సోనమ్ వాంగ్‌చుక్‌కు సీజేపీ అధినేత రిక్వెస్ట్..

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి.. పోలీస్ కానిస్టేబుల్ మృతి..

Updated Date - Jul 22 , 2026 | 05:56 PM