Share News

పదేళ్లలో 152 పరీక్షల పేపర్లు లీక్‌

ABN , Publish Date - Jul 23 , 2026 | 05:25 AM

దేశంలో విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, గత పదేళ్లలో ఏకంగా 152 పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్‌ అయ్యాయని కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు...

పదేళ్లలో 152 పరీక్షల పేపర్లు లీక్‌

నెలకు ఒకటి లీక్‌.. శిక్షలు మాత్రం సున్నా

7.50 కోట్ల మంది విద్యార్థులపై తీవ్ర ప్రభావం

మోదీ హయాంలో అవినీతిమయమైన విద్యా వ్యవస్థ

ప్రతిపక్ష నేతగా ప్రజల గళం వినిపించడం నా బాధ్యత

ప్రజల కోసం ఎన్ని దెబ్బలైనా తినడానికి నేను సిద్ధం

ధర్మేంద్ర ప్రధాన్‌ అవినీతిపరుడు, అసమర్థుడు

దేశ యువతకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి

మీడియాతో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ

ఇంత అప్రజాస్వామికమా?: ప్రియాంక

నీట్‌ విద్యార్థులపై పోలీసు చర్యను ఖండిస్తూ

నల్లదుస్తుల్లో పార్లమెంట్‌ వద్ద విపక్ష ఎంపీల నిరసన

న్యూఢిల్లీ, జూలై 22(ఆంధ్రజ్యోతి): దేశంలో విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, గత పదేళ్లలో ఏకంగా 152 పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్‌ అయ్యాయని కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. సగటున నెలకు ఒక పేపర్‌ లీక్‌ అవుతున్నా బాధ్యులైన వారికి పడిన శిక్షలు మాత్రం ‘సున్నా’ అని మండిపడ్డారు. బుధవారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీట్‌ ప్రశ్నపత్రాల లీకేజీకి నిరసనగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పోలీసుల లాఠీ దెబ్బలకు గాయపడిన విద్యార్థుల ఆక్రందనల దృశ్యాలను మీడియాకు ప్రదర్శించారు. ఒకప్పుడు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన భారత విద్యా వ్యవస్థ.. మోదీ ప్రభుత్వ హయాంలో అక్రమాలు, లీకేజీలకు నిలయంగా మారిందని మండిపడ్డారు. దేశంలో పేపర్‌ లీకేజీలు ఒక పెద్ద మాఫియాగా మారాయని, దీని వెనుక ఉన్న బడాబాబులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని రాహుల్‌ దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం కంటితుడుపు చర్యలకు స్వస్తి చెప్పి, పటిష్ఠ చట్టాలు తీసుకురావాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.


‘గత దశాబ్ద కాలంలో దేశంలో ఏకంగా 152 పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్‌ అయ్యాయి. దీనివల్ల 7.50 కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమైంది. ఇన్ని లీకేజీలు జరిగినా ఒక్క బాధ్యుడికి కూడా శిక్ష పడకపోవడం దారుణం. నీట్‌ లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెంటనే రాజీనామా చేయాలి. విద్యా వ్యవస్థను నాశనం చేసినందుకు ప్రధాని మోదీ దేశ యువతకు క్షమాపణ చెప్పాల’ని రాహుల్‌ డిమాండ్‌ చేశారు. ‘విద్యా రంగానికి కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు సుమారు రూ.1.4 లక్షల కోట్లు అయితే, ప్రతి ఏటా నీట్‌ వంటి పరీక్షల కోసం విద్యార్థుల కుటుంబాలు ఏకంగా రూ.1.32 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఇంత సొమ్ము వసూలు చేసి చివరకు ‘పేపర్‌ లీక్‌ అయింది’ అని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఇది పక్కా ప్రణాళికతో జరుగుతున్న దోపిడీ కాదా?’ అని ప్రశ్నించారు. ‘ధర్మేంద్ర ప్రధాన్‌ అసమర్థుడు, అవినీతిపరుడు. ఈ విద్యా సంక్షోభానికి ఆయనే బాధ్యత వహించాల’ని డిమాండ్‌ చేశారు. ‘దెబ్బలు తినడం నాకు అలవాటే. నేను నాకు తగిలిన దెబ్బల గురించి బాధపడటం లేదు. విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం చూస్తుంటేనే బాధగా ఉంది. ప్రజల గళం వినిపించడం ప్రతిపక్ష నేతగా నా బాధ్యత. ఇందుకోసం ఎన్ని దెబ్బలైనా తినడానికి సిద్ధంగా ఉన్నా’నని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థుల పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తుందని, రాజకీయాల కోసం కాదని స్పష్టం చేశారు.

Also Read:

కౌంటీ ఛాంపియన్‌షిప్: యార్క్‌షైర్‌తో కుల్‌దీప్ యాదవ్ ఒప్పందం

గిద్దలూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

Updated Date - Jul 23 , 2026 | 05:25 AM