Share News

ఓటూ మీదే.. పోరాటమూ మీదే!

ABN , Publish Date - Oct 26 , 2026 | 04:59 AM

ఓటు హక్కుపై జరుగుతున్న దాడిని ఊరికే చూస్తూ ఊరుకోబోమని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ హెచ్చరించారు

ఓటూ మీదే.. పోరాటమూ మీదే!
rahulgandhi

  • ఓటు హక్కును, దేశాన్ని రక్షించుకుందాం

  • 1న రామ్‌ లీలా మైదాన్‌కు భారీగా తరలిరండి

  • దేశ ప్రజలకు రాహుల్‌ గాంధీ పిలుపు

  • ఈ నెల 30న మాక్‌ పార్లమెంటు, సీఈసీ అభిశంసన

  • నవంబరు 1న ర్యాలీకి తరలిరండి.. దేశ ప్రజలకు రాహుల్‌ గాంధీ పిలుపు

న్యూఢిల్లీ, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ఓటు హక్కుపై జరుగుతున్న దాడిని ఊరికే చూస్తూ ఊరుకోబోమని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ హెచ్చరించారు. ‘ఓటూ మీదే.. పోరాటమూ మీదే’ అంటూ... రాజ్యాంగాన్ని, ఓటు హక్కును పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ కదలి రావాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజా తీర్పును కాల రాసే కుట్రలు జరుగుతున్నాయని ఆదివారం ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు. ‘‘మన ఓట్లను హరిస్తున్నారు... దీన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మౌనంగా సహించేది లేదు... ఓటర్ల జాబితాల నుంచి పేర్లను తొలగించారు. నిబంధనలను నీరుగార్చారు. ప్రశ్నించిన వారిపై లాఠీలతో విరుచుకుపడ్డారు. ఇప్పుడు దేశమే దీనికి సమాధానం చెబుతుంది. నవంబరు 1న దిల్లీకి తరలిరండి... ‘ఓటును కాపాడుకుందాం-దేశాన్ని రక్షించుకుందాం’ పేరిట చేపట్టే జన్‌ మార్చ్‌, భారీ బహిరంగ సభలో పాల్గొనండి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలనే తపన ఉన్న విద్యార్థులు, రైతులు, కార్మికులు, మహిళలు, యువత, వ్యాపారులు... ఇలా ప్రతీ ఒక్కరూ కదలి రావాలి. ఓటూ మీదే... పోరాటమూ మీదే...’’ అంటూ ‘ఎక్స్‌’ వేదికగా రాహుల్‌ వెల్లడించారు.


మరోవైపు ‘‘న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి అత్యంత ఉత్సాహంగా ప్రచారం కల్పిస్తూ, విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న బీజేపీ, దాని మిత్రపక్షాలకు హృదయపూర్వక ధన్యవాదాలు... రాబోయే ఏడు రోజులపాటు ఇదే దీక్షాదక్షతలను కొనసాగించండి’’ అని ఎద్దేవా చేశారు. నవంబరు 1న 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల వార్షికోత్సవం ఉన్నందున ఆ రోజు సభ నిర్వహిస్తే సిక్కుల మనోభావాలు దెబ్బతింటాయని బీజేపీ పేర్కొన్న నేపథ్యంలో రాహుల్‌ ఇలా స్పందించారు. కాగా ఢిల్లీ చాంబర్‌ ఆఫ్‌ ట్రేడ్‌ అండ్‌ ఇండస్ట్రీ కూడా నవంబరు 1న సభ నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తోంది. పండుగ సీజన్‌ వ్యాపారం దెబ్బతింటుందని, నవంబరు 10వ తేదీ వరకు సభ వాయిదా వేయాలని రాహుల్‌గాంధీని కోరింది. అలాగే ఫెడరేషన్‌ ఆఫ్‌ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్‌ ఆఫ్‌ ఇండియా కూడా నవంబరు 1న సభ నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తోంది. కాగా ఇండియా కూటమి నేతలు ఈ నెల 30న ఢిల్లీలోని అశోకా హోటల్‌లో మాక్‌ పార్లమెంట్‌ నిర్వహించి సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌పై మాక్‌ అభిశంసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యలు.. ఎన్డీయే నేతల తీవ్ర ఆగ్రహం

యూపీలో దారుణం.. మరిది ప్రైవేట్ పార్ట్స్‌ను కొరికేసిన వదిన

Updated Date - Oct 26 , 2026 | 05:00 AM